- దేశభక్తి నినాదం కాదు…త్యాగంలోనే కన్పిస్తోంది
- శ్యామా ప్రసాద్ ముఖర్జీ మరణమే నిదర్శనం
- ఆయన మరణం దేశ సమైక్యత కోసం చేసిన మహా త్యాగం
- ముఖర్జీ త్యాగం దేశభక్తుల హృదయాల్లో శాశ్వతం
- కొంతమంది పదవుల కోసం రాజకీయాలు చేస్తారు….రాజకీయాలను దేశసేవకు సాధనంగా చేసుకున్న మహనీయుడు
శ్యామాప్రసాద్ ఆశయాలను తూ.చ తప్పక అమలు చేస్తున్న మోదీ ప్రభుత్వం
- 370 ఆర్టికల్ రద్దు, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా ముఖర్జీ ఆకాంక్షలే
దళారీ వ్యవస్థ లేకుండా లబ్దిదారులకు సంక్షేమ ఫలాలు అందిస్తున్న మోదీ సర్కార్
శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించిన కేంద్ర మంత్రి బండి సంజయ్
హైదరాబాద్ వెలుతురు జూలై 06:
‘‘దేశం కోసం మాట్లాడినవారు ఎందరో ఉన్నారు. దేశం కోసం ప్రాణం ఇచ్చినవారు చాలా కొద్దిమంది ఉంటారు. అందులో శ్యామా ప్రసాద్ ముఖర్జీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.’’అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొనియాడారు. దేశం కోసం బలిదానం చేసిన మహనీయుల త్యాగాన్ని మరచిపోయిన జాతి తన భవిష్యత్తును కూడా కోల్పోతుందనే విషయాన్ని గుర్తు చేశారు. శ్యామా ప్రసాద్ ఆశయాలను, ఆకాంక్షలను నరేంద్రమోదీ ఆధ్వర్యంలో నితిన్ నబిన్ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ తూ.చ తప్పుకుండా అమలు చేస్తోందని తెలిపారు. భారత్ కు అణ్వస్త్రాలను సమకూర్చడం, 370 ఆర్టికల్ ను రద్దు చేసి కాశ్మీర్ ను భారత్ లో అంతర్భాగం చేయడంతోపాటు మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి పథకాల అమలుతో స్వయం సమ్రుద్ధి దేశంగా భారత్ ను తీర్చిదిద్దుతుండటమే ఇందుకు నిదర్శమని పేర్కొన్నారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ సోమవారం రోజున ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం శ్యామా ప్రసాద్ త్యాగాలను గుర్తు చేసుకుంటూ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యాంశాలు…
భారతదేశ అసలు సిసలైన హీరో శ్యామాప్రసాద్ ముఖర్జీ. దేశం కోసం యుద్దం చేయడానికి సిద్దంగా ఉండాలని జన సంఘ్ కార్యకర్తలను పిలుపునివ్వడమే కాకుండా కార్యకర్తలకు తుపాకీలిచ్చి పాకిస్తాన్ పై యుద్దం చేయడానికి పంపిన వీరుడు. పార్టీ, రాజకీయాల కంటే దేశమే ఫస్ట్ అని చాటి చెప్పిన గొప్ప నేత శ్యామాప్రసాద్ ముఖర్జీ. దేశం కోసం ఆత్మ బలిదానం చేసుకున్న ఏకైక జాతీయ పార్టీ అధ్యక్షులు, పార్లమెంట్ లో ఏకైక ప్రతిపక్ష నేత కూడా ఆయనే.
కాశ్మీర్ వెళ్లడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పర్మిట్ కార్డు తప్పనిసరి చేస్తే నా దేశం వెళ్లడానికి పర్మిట్ కార్డు ఎందుకని ప్రశ్నిస్తూ ‘ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్, దో నిషాన్ నహీ నహీ ఛలేగా…నహీ ఛలేగా’ అంటూ 370 ఆర్టికల్ రద్దు కోసం పోరాడిన మహనీయుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ. ఆనాడు పర్మిట్ అవసరం లేదని పేర్కొంటూ కశ్మీర్ బయలుదేరిన శ్యామా ప్రసాద్ ముఖర్జీని నాటి ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసి కనీస సౌకర్యాలు లేని జైల్లో నిర్బంధానికి గురి చేసింది. ఆనాడు అటువైపుగా వెళుతున్న నాటి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ ముఖర్జీని పరామర్శించాలని సోయి లేకుండా వెళ్లిపోయారు. ఆ నిర్బంధంలోనే అనుమానాస్పద స్థితిలో ముఖర్జీ మరణిస్తే కనీసం విచారణ జరపని అమానవీయ ప్రభుత్వం కాంగ్రెస్ ది. ఆయన చనిపోయాక కాశ్మీర్ కు వెళ్లడానికి వీసా తప్పనిసరి అనే విధానాన్ని నెహ్రూ ప్రభుత్వం రద్దు చేసింది. ఇది బీజేపీ సాధించిన తొలి విజయం.
స్వతంత్ర ఫలాలు అట్టడుగు స్థాయి వరకు తీసుకెళ్లాలని పార్లమెంట్ లో పోరాడితే… డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సైతం శ్యామాప్రసాద్ కు మద్దతు తెలిపారంటే ఆయన గొప్పతనం, కమిట్ మెంట్ ను అర్ధం చేసుకోవచ్చు. ఆనాడు పార్లమెంట్ లో నెహ్రూ మాట్లాడుతూ ‘నీ పార్టీ ఎంత? నువ్వెంత? నీ పార్టీని మొత్తం నాశనం చేస్తా’నని చెబితే…. అందుకు ప్రతిగా నా పార్టీని నాశనం చేయడం సంగతి తరువాత…‘‘నాశనం చేస్తాననే మీ ఆలోచననే నాశనం చేస్తా’’నంటూ ధీటుగా బదులిచ్చిన నాయకుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ. భారతదేశ రక్షణ కోసం అణ్వస్త్రాలు ఉండాలని ఆకాంక్షించిన దూరద్రుష్టి కలిగిన నాయకుడు.
దేశం కోసం చనిపోవడం గొప్ప విషయం. కానీ దేశం ఒక్కటిగా ఉండాలని కోరుకుంటూ ప్రాణాలు అర్పించడం మరింత గొప్ప విషయం. ఆ త్యాగానికి ప్రతిరూపం డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ. కొంతమంది పదవుల కోసం రాజకీయాలు చేస్తారు. కానీ రాజకీయాలను దేశసేవకు ఒక సాధనంగా మలుచుకున్న మహానీయుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ. దేశభక్తి అనేది నినాదాల్లో కాదు, త్యాగంలో కనిపిస్తోందనడానికి ముఖర్జీ జీవితమే నిదర్శనం. శ్యామా ప్రసాద్ మరణించినా ఆయన ఆలోచనలు, ఆశయాలు మాత్రం సదా చిరస్మరణీయం.
ఆ మహనీయుడి ఆలోచనలను, ఆశయాలను, ఆకాంక్షలను భారతీయ జనతా పార్టీ తూ.చ తప్పకుండా అమలు చేస్తోంది. ముఖర్జీ ఆకాంక్షలకు అనుగుణంగా వాజ్ పేయి ప్రభుత్వం అణ్వాయుధాలను సమకూరిస్తే… 370 ఆర్టికల్ ను రద్దు చేసి శ్యామా ప్రసాద్ ముఖర్జీ కలను నరేంద్రమోదీ నెరవేర్చారు. దేశ స్వాలంబన కోసం శ్యామా ప్రసాద్ ముఖర్జీ పరితపిస్తే మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా పేరుతో దేశం స్వయం సమ్రుద్ది సాధించేలా ఆచరణలోకి తీసుకొచ్చిన గొప్ప నేత నరేంద్రమోదీ. దేశ విభజన సమయంలో అనుకోని పరిస్థితుల్లో విదేశాలకు వెళ్లి తిరిగి మాత్రుభూమికి వచ్చిన వారికి అండగా ఉండేందుకు పౌరసత్వ సవరణ బిల్లును తీసుకొచ్చిన ప్రభుత్వం నరేంద్రమోదీదే. శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆశయాల మేరకు మధ్య దళారీ వ్యవస్థ లేకుండా ప్రభుత్వ ఫలాలను నేరుగా లబ్దిదారులకు అందిస్తున్న ప్రభుత్వం కూడా నరేంద్రమోదీదే. శ్యామా ప్రసాద్ ఆశయాలు, ఆకాంక్షలను అమలు చేయడమే ఆయనకు అందించే ఘనమైన నివాళి.
