కాళేశ్వ‌రంపై చర్చకు కేసీఆర్ అసెంబ్లీకి రావాలి: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

  • కేసీఆర్ అసెంబ్లీకి రావాలి- కాళేశ్వ‌రంపై వివ‌ర‌ణ ఇవ్వాలి
  • కేసీఆర్ తేదీ చెబితే ప్ర‌త్యేక అసెంబ్లీ నిర్వ‌హించేందుకు సిద్ధం
  • కాళేశ్వ‌రం అవినీతి, ఇందిర‌మ్మ ఇళ్ల‌పై ప్ర‌జ‌ల ముందే చ‌ర్చిద్దాం
  • రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

 

సిద్ధిపేట / హైదరాబాద్ వెలుతురు జూలై 06:

దేశంలోనే “ఎనిమిదో వింత”గా కాళేశ్వరం ప్రాజెక్టును ప్రచారం చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి కాళేశ్వరం ఎందుకు కుంగిపోయిందో, వేల కోట్ల ప్రజాధనం ఎలా వృథా అయిందో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ తేదీ, సమయం సూచిస్తే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామ‌ని స్పష్టం చేశారు.

సోమవారం సిద్ధిపేట జిల్లా ములుగు మండ‌లంలో సహచర మంత్రి వివేక్ వెంకటస్వామి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి రెండ‌వ విడ‌త ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరు ప‌త్రాలు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు అంద‌జేశారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి  మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టింది మీరే… కూలింది మీ హ‌యాంలోనే .. ఇప్పుడు మళ్లీ అక్కడికి వెళ్లి గొప్పలు చెప్పుకోవడం కూడా మీరే. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధమేంటి?” అని ప్రశ్నించారు.

ప్రతి పేదవాడి చెమటోడ్చి చెల్లించిన పన్నుల డబ్బుతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యత లేక కుంగిపోతే, దానికి బాధ్యత వహించాల్సింది బీఆర్ఎస్ నాయకత్వమేనని అన్నారు. గోదావరి జలాలను కృష్ణా పరివాహక ప్రాంతాలకు తరలించే పేరుతో నిర్మించిన ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేసి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రభుత్వంపై ఎన్ని నిరాధార ఆరోపణలు చేసినా ప్రజలు వాటిని తిరస్కరిస్తూనే ఉన్నారని, అధికార దాహంతో చేస్తున్న రాజకీయాలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతున్నారని అన్నారు. నిజంగా ప్రజాహితం కోసం సూచనలు ఇవ్వాలనుకుంటే అసెంబ్లీ వేదిక సిద్ధంగా ఉందని, అక్కడే అన్ని అంశాలపై బహిరంగంగా చర్చిద్దామని కేసీఆర్‌కు సవాల్ విసిరారు.

రాష్ట్రంలో ఇప్పటికీ 32 వేల కుటుంబాలు పూరిగుడిసెల్లో జీవిస్తున్నాయని ప్రభుత్వం గుర్తించిందని, రెండో విడత నుంచి నాలుగో విడత వరకు వారికి అత్యంత ప్రాధాన్యంతో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధిపేటతో పాటు కొద్ది ప్రాంతాల్లో మాత్రమే ఇళ్లు నిర్మించి, మిగిలిన నియోజకవర్గాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. నిర్మించిన ఇళ్లను కూడా అసంపూర్తిగా వదిలేసిందని అన్నారు. గత పదేళ్లలో ప్రతి ఏడాది లక్ష ఇళ్లు నిర్మించి ఉంటే నేడు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.

ప్రస్తుతం మెదక్, హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేస్తున్నామని, మహిళల సాధికారతకు ప్రాధాన్యమిస్తూ ఆడబిడ్డల పేరుతో ఇళ్ల పట్టాలు అందిస్తున్నామని చెప్పారు.

రాష్ట్రంలో తొలి విడత ఇందిరమ్మ ఇళ్లలో ఇప్పటికే లక్షా 30 వేల ఇళ్ల గృహప్రవేశాలు పూర్తయ్యాయని, మరో 70 నుంచి 75 వేల ఇళ్లు శ్లాబ్ దశకు చేరుకున్నాయని తెలిపారు. కులం, మతం, పార్టీ అనే తేడా లేకుండా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇళ్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు.

మొదటి విడత విజయవంతం కావడంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టారని, ఈ విడతలో రెండున్నర లక్షల ఇళ్లను మంజూరు చేశామని, ప్రతి నియోజకవర్గంలో రెండు వేల ఇళ్లు నిర్మించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని వివరించారు. ఇందులో 1,500 కొత్త ఇళ్లతో పాటు గతంలో అసంపూర్తిగా మిగిలిపోయిన 500 రేకుల ఇళ్లు, మొండిగోడల ఇళ్ల పూర్తి కోసం కూడా నిధులు విడుదల చేస్తున్నామని మంత్రి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.