- శాసనసభ నిర్వహణలో విప్‌ల పాత్ర అత్యంత కీలకమని వ్యాఖ్య
- సభా కార్యక్రమాలు సజావుగా సాగేలా సమన్వయం చేయాలని సూచన
- కార్యాలయాలను ప్రారంభించి విప్‌లకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- సభ్యులకు అవసరమైన మార్గనిర్దేశం చేయాలని విప్‌లకు పిలుపు
- మీడియా అడ్వైజర్ కమిటీ కార్యాలయాన్నీ ప్రారంభించిన మంత్రి
- కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన పొంగులేటి
- పలువురు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరు
- శాసనసభ వ్యవహారాల సమర్థ నిర్వహణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం
హైదరాబాద్ వెలుతురు జూలై 06:
ప్రభుత్వ విప్‌లుగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్, ఎమ్మెల్యే వేముల వీరేశంకు అసెంబ్లీ ప్రాంగణంలో కేటాయించిన ప్రత్యేక కార్యాలయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, శాసనసభ కార్యకలాపాల నిర్వహణలో వారి పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు.
శాసనసభ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడంలో విప్‌లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంత్రి సూచించారు. సభ్యులకు అవసరమైన మార్గనిర్దేశం చేయడంతో పాటు, సభా కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా జరిగేలా సమన్వయం చేయాలని కోరారు. తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తూ శాసనసభ గౌరవాన్ని మరింత పెంచాలని ఆకాంక్షించారు.
అనంతరం శాసనసభ ప్రాంగణంలో మీడియా అడ్వైజర్ కమిటీ కార్యాలయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, శాసనసభ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు సమర్థవంతంగా చేరవేయడంలో మీడియా అడ్వైజర్ కమిటీ కీలక పాత్ర పోషించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, నాయకులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
