కేరళకు చెందిన ‘జైహింద్ టీవీ ఛానల్’లో పెట్టుబడుల వ్యవహారంలో కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్‌కు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. విచారణ కోసం ఈ నెల 11న ఢిల్లీలోని తమ కార్యాలయానికి రావాలని పేర్కొంది. ‘జైహింద్ టీవీ’లో పెట్టుబడులు, వాటాల వివరాలు తెలపాలని కోరింది. ఈ కేసులో శివకుమార్, ఆయన భార్య ఉషతో పాటు మరో 30 మందికి కూడా సీబీఐ నోటీసులు పంపించింది. కాగా జైహింద్ ఛానల్‌లో పెట్టుబడులు రహస్యం కాదని డీకే శివకుమార్ చెబుతున్నారు. ఛానల్‌లో తనకు వాటా ఉందని 2017-18లో దాఖలు చేసిన ప్రమాణపత్రం, ఆస్తి వివరాలలో ఆయన పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో తనపై ఒత్తిడి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థల ద్వారా వేధిస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు.
కాగా డీకే శివకుమార్ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2013-18 మధ్యకాలంలో ఆయన ఆదాయం లెక్కకు మించి ఉందని 2020లో సీబీఐ కేసు నమోదు చేసింది. పలు అవినీతి ఆరోపణలు, ఢిల్లీలోని ఫ్లాట్‌లో రూ.8 కోట్ల నగదు పట్టుబడిన వ్యవహారంలో సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసులను ఆయన ఎదుర్కొంటున్నారు.
జైహింద్ టీవీ ఛానల్ పెట్టుబడుల వ్యవహారంలో శివకుమార్‌పై కేసును సీబీఐ దర్యాప్తు చేపట్టేందుకు వీలుగా యెడియూరప్ప సీఎంగా ఉన్న సమయంలో కర్ణాటక ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అయితే గతేడాది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక నవంబరు 20న జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీబీఐ అనుమతిని రద్దు చేశారు. కేబినెట్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ బీజేపీ నాయకుడు బసనగౌడ పాటిల్ యత్నాళ్ ఉన్నత న్యాయస్థానంలో రిట్ పిటిషన్ వేయగా విచారణ జరుగుతోంది.