ఇందిర‌మ్మ ఇళ్ల ప‌థకంలో స్టీల్, సిమెంట్ ప‌రిశ్రమ‌లు భాగ‌స్వాములు కావాలి: మంత్రులు శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు

  • ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగస్వాములు కావాలి
  • స్టీల్, సిమెంట్ ధ‌ర‌లు త‌గ్గించాలి
  • సంస్థలు సామాజిక బాధ్యతతో ముందుకు రావాలి
  • పరిశ్రమలకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు విజ్ఞప్తి
  • సానుకూలంగా స్పందించిన ప‌రిశ్ర‌మ‌ల యాజమాన్యాలు

హైదరాబాద్ వెలుతురు జూలై 09:

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేయాలనే సంక‌ల్పంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా  చేప‌ట్టిన ఇందిర‌మ్మ ఇళ్ల ప‌ధ‌కంలో స్టీల్ , సిమెంట్ ప‌రిశ్ర‌మ‌లు భాగ‌స్వాములు కావాల‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ,  పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విజ్ఞ‌ప్తి చేశారు.

గురువారం సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్టీల్, సిమెంట్ తదితర నిర్మాణ సామగ్రి ధరలు, సరఫరా, పరిశ్రమల సహకారం అంశాలపై వివిధ స్టీల్, సిమెంట్ పరిశ్రమల ప్రతినిధులతో స‌మావేశమ‌య్యారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ…తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కేవలం గృహ నిర్మాణ కార్యక్రమం మాత్రమే కాదని, పేద కుటుంబాలకు గౌరవప్రదమైన జీవితం, సామాజిక భద్రత, ఆత్మగౌరవాన్ని కల్పించే మహాయజ్ఞమని అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా (హైద‌రాబాద్ మినహా) మొదటి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. వీటిలో ఇప్పటికే గణనీయ సంఖ్యలో 85 శాతం ఇళ్ల శ్లాబులు పూర్తయ్యాయని, మిగిలిన 15 శాతం ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. రెండో విడతలో నియోజ‌క‌వ‌ర్గానికి రెండు వేల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా రెండున్న‌ర ల‌క్ష‌ల ఇళ్లు మంజూరు , అలాగే క్యూర్ ప‌రిధిలో ల‌క్ష ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని కార్యాచరణ చేపట్టిందన్నారు. గిరిజ‌న నియోజ‌క‌వ‌ర్గాల్లో అద‌నంగా వెయ్యి నుంచి 1500 ఇళ్లు మంజూరు చేస్తున్నాం. ఇళ్ల మంజూరు నిరంత‌ర ప్ర‌క్రియ‌. మూడు, నాలుగ‌వ విడ‌త‌ల్లో కూడా ఇళ్ల‌ను మంజూరు చేస్తాం.

దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా 100 శాతం సబ్సిడీతో రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తూ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టడం లేదని, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు.

ప్రభుత్వంపై ఎంతటి ఆర్థిక భారం పడినా పేదల ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి రాజీ ప‌డ‌కుండా ప్రతి లబ్ధిదారుడికి నిర్మాణ పురోగతికి అనుగుణంగా విడతల వారీగా ప్ర‌తి సోమ‌వారం పారదర్శకంగా నిధులను విడుదల చేస్తున్నామని తెలిపారు. ప్రతి పేద కుటుంబం సొంత ఇంటిలో నివసించే వరకు ప్రభుత్వం తన బాధ్యతను పూర్తి నిబద్ధతతో నిర్వర్తిస్తుందని అన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ఈ బృహ‌త్త‌ర‌మైన ఇందిర‌మ్మ ఇళ్ల ప‌ధ‌కంలో స్టీల్, సిమెంట్ ప‌రిశ్ర‌మ‌ల యాజ‌మాన్యాలు కూడా భాగ‌స్వామ్యం కావాల‌ని పిలుపునిచ్చారు. ఇందిర‌మ్మ ఇళ్ల‌కు అవ‌స‌ర‌మైన స్టీల్‌, సిమెంట్‌ను త‌క్కువ ధ‌ర‌కే అందించాల‌ని మంత్రులు చేసిన విజ్ఞ‌ప్తికి సానుకూలంగా స్పందించారు.

ప్రభుత్వం–పరిశ్రమలు–ప్రజలు కలిసి పనిచేస్తే తెలంగాణలో గుడిసెలు లేని రాష్ట్రం లక్ష్యాన్ని త్వరితగతిన సాధించవచ్చని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ఒక ప్రజా ఉద్యమంగా మార్చేందుకు ప్రతి వర్గం సహకారం అందించాలని మంత్రులు పిలుపునిచ్చారు. పేద‌వాడికి ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా స‌హాయ‌మందిస్తే ప్ర‌భుత్వంతో పాటు ప‌రిశ్ర‌మ‌ల యాజ‌మాన్యాల‌ను కూడా చిర‌స్ధాయిగా గుర్తుపెట్టుకుంటార‌ని అన్నారు.
ప‌రిశ్ర‌మ‌లు, హౌసింగ్ అధికారులు ఆయా ప‌రిశ్ర‌మ‌ల యాజ‌మాన్యాల‌తో స‌మ‌న్వ‌యం చేసుకొని ల‌బ్దిదారునికి ఏవిధంగా మెటీరియ‌ల్ చేర‌వేయాలన్న దానిపై రూట్ మ్యాప్ త‌యారు చేయాల‌ని మంత్రులు సూచించారు.

ఈ సమావేశంలో ప‌రిశ్ర‌మల యాజ‌మాన్యాల‌తోపాటు హౌసింగ్ సెక్ర‌ట‌రీ వి.పి.గౌత‌మ్, ప‌రిశ్ర‌మ‌ల శాఖ స్పెష‌ల్ సెక్ర‌ట‌రీ కృష్ణాదిత్య‌, టీజీఐఐసీ ఎండీ శ‌శాంక త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.