దేశానికే ఆదర్శంగా బీబీనగర్ ఎయిమ్స్‌: జేపీ నడ్డా

  • సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’గా తీర్చిదిద్దుతాం: జేపీ నడ్డా
  • బీబీనగర్ ఎయిమ్స్‌ను సందర్శించిన కేంద్ర ఆరోగ్య మంత్రి
  • రూ.1,000 కోట్లతో నిర్మాణ పనులు
  • ఇప్పటికే 87 శాతం పనులు పూర్తి
  • రోజుకు 1,800 మందికి వైద్య సేవలు
  • 24 వైద్య విభాగాలతో సేవలు
  • రెండు ఎంబీబీఎస్ బ్యాచ్‌లు పూర్తి
  • టెలీమెడిసిన్‌తో లక్షల మందికి ప్రయోజనం
  • దేశవ్యాప్తంగా ఆరోగ్య మౌలిక వసతుల విస్తరణపై నడ్డా
  • 2014 తర్వాత 23 కొత్త ఎయిమ్స్‌లకు ఆమోదం
  • దేశానికే ఆదర్శ వైద్య సంస్థగా ఎదుగుతుందన్న ఆశాభావం

బీబీనగర్ వెలుతురు జూలై 09:

బీబీనగర్ ఎయిమ్స్‌ను ఆధునిక వైద్య సేవలు, వైద్య విద్య, పరిశోధన రంగాల్లో దేశంలోనే అత్యుత్తమ ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ గా తీర్చిదిద్దుతామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఆరోగ్య, మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆయన తెలిపారు.

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్‌ను సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన నడ్డా, ఈ సంస్థ నిర్మాణానికి సుమారు రూ.1,000 కోట్లు వెచ్చిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం నిర్మాణ పనుల్లో 87 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులు వేగంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు.

దేశంలో ఒకప్పుడు ఢిల్లీలో మాత్రమే ఎయిమ్స్ ఉండేదని గుర్తు చేసిన ఆయన, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయీ హయాంలో ఐదు కొత్త ఎయిమ్స్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. 2014 తర్వాత మరో 23 ఎయిమ్స్‌లకు కేంద్రం ఆమోదం తెలిపిందని, వాటిలో 14 ఇప్పటికే పూర్తయ్యాయని, మిగిలినవి నిర్మాణ దశలో ఉన్నాయని వివరించారు.

బీబీనగర్ ఎయిమ్స్‌లో ప్రస్తుతం 24 వైద్య విభాగాలు పనిచేస్తున్నాయని, రెండు ఎంబీబీఎస్ బ్యాచ్‌లు విజయవంతంగా పూర్తయ్యాయని నడ్డా తెలిపారు. ప్రతిరోజూ సుమారు 1,800 మంది ఔట్‌పేషెంట్లకు వైద్య సేవలు అందుతున్నాయని, అత్యవసర చికిత్సలు, ఆధునిక నిర్ధారణ పరీక్షలు, టెలీమెడిసిన్ సేవలు సమర్థంగా కొనసాగుతున్నాయని చెప్పారు. టెలీమెడిసిన్ ద్వారా ఇప్పటికే లక్షలాది మంది ప్రయోజనం పొందారని వెల్లడించారు.

పూర్తిస్థాయి బోధనా సిబ్బంది, ఆధునిక వైద్య సదుపాయాలతో బీబీనగర్ ఎయిమ్స్ ఇప్పటికే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తోందని, రానున్న రోజుల్లో దేశానికే ఆదర్శ వైద్య సంస్థగా ఎదుగుతుందని జేపీ నడ్డా విశ్వాసం వ్యక్తం చేశారు. 

అంతకుముందు ఎయిమ్స్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించిన నడ్డా, అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు లక్ష్మణ్, డీకే అరుణ, చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్,  ఎయిమ్స్ అధికారులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.