హైదరాబాద్‌లోని బస్తీ దవాఖానాల తనిఖీలకు ప్రత్యేక అధికారుల నియామకం.
వర్షాకాల సీజన్ నేపథ్యంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యం – హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ వెలుతురు జూలై 09:
హైదరాబాద్ జిల్లా పరిధిలోని 169 బస్తీ దవాఖానల పనితీరు, ప్రజలకు అందుతున్న వైద్య సేవల నాణ్యతను ఈనెల 10 వ తేదీన క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
ఈ తనిఖీలను సమన్వయం చేస్తూ తనతో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, జిల్లా కలెక్టర్ డా. ప్రియాంక అలా రాబోయే రెండు మూడు రోజుల పాటు ఎంపిక చేసిన ముఖ్యమైన బస్తీ దవాఖానలను స్వయంగా తనిఖీలు చేస్తామని వెల్లడించారు.
వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు వంటి సీజనల్ వ్యాధులను సమర్థవంతంగా నివారించేందుకు బస్తీ దవాఖానలను మరింత బలోపేతం చేయడం, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవడమే ఈ ప్రత్యేక పర్యవేక్షణ ప్రధాన ఉద్దేశమని మంత్రి తెలిపారు.
బస్తీ దవాఖానల్లో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటూ వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అలాగే మందుల నిల్వలు, ప్రయోగశాల సేవలు, పరిశుభ్రత, అవసరమైన మౌలిక వసతులు తదితర అంశాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి లోపాలను వెంటనే సరిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
ప్రజలకు అందుబాటులో, నాణ్యమైన ప్రాథమిక వైద్య సేవలు అందించడంలో బస్తీ దవాఖానలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వర్షాకాలంలో ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ప్రతి బస్తీ దవాఖాన ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా పనిచేయాలి అని సూచించారు.
హైదరాబాద్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో తమ పరిధిలో ఉన్న బస్తీ దవాఖానలను స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేటర్లు అలాగే ఇతర ప్రజాప్రతినిధులు విధిగా సందర్శించి, అక్కడి పరిస్థితులను సమీక్షిస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా అధికారులతో సమన్వయం చేయాలని మంత్రి పేర్కొన్నారు.
ప్రజా ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని, బస్తీ దవాఖానలను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు నిరంతరం కొనసాగిస్తుందని హైదరాబాద్ ఇన్చార్జ్ మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
