జూలై 10న ఖమ్మంలో సీఎం రైతు ఆశీర్వాద సభ

  • రైతు భరోసాకు మరో రూ.1,900 కోట్లు
  • రైతు ఆశీర్వాద సభకు సీఎం రేవంత్
  • కాంగ్రెస్ రైతు పక్షపాత ప్రభుత్వమన్న భట్టి
  • రెండున్నరేళ్లలో రూ.35 వేల కోట్లు
  • తొమ్మిది రోజుల్లో రూ.8,759 కోట్లు
  • తొమ్మిది నుంచి 50 ఎకరాలకు సాయం
  •  క్రాప్ డ్యామేజ్‌పై కేసీఆర్‌కు ప్రశ్న
  • రైతుల కోసం చిత్తశుద్ధితో పని
  • ఖమ్మంలో భట్టి కీలక ప్రకటన
  • సభకు రైతులు తరలిరావాలని పిలుపు

హైదరాబాద్ వెలుతురు జూలై 09:

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, రైతు భరోసా పథకం కింద మరో రూ.1,900 కోట్లను జూలై 10న ఖమ్మంలో జరిగే  రైతు ఆశీర్వాద సభలో విడుదల చేయనున్నట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇప్పటికే రెండు విడతల్లో భారీగా నిధులు విడుదల చేసిన ప్రభుత్వం, ఇప్పుడు తొమ్మిది ఎకరాల నుంచి 50 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు కూడా ఆర్థిక సాయాన్ని అందించనున్నట్లు వెల్లడించారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో నిర్వహించనున్న రైతు ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గ సభ్యులంతా హాజరుకానున్నట్లు తెలిపారు.

గురువారం ఖమ్మం జిల్లా చింతకాని మండలం లచ్చగూడెంలో పర్యటించిన భట్టి విక్రమార్క పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జగన్నాథపురం-మత్కేపల్లి క్రాస్ రోడ్డులో నిర్వహించే రైతు ఆశీర్వాద సభకు పెద్ద ఎత్తున రైతులు తరలిరావాలని పిలుపునిచ్చారు. రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

రైతు భరోసా అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం రికార్డు స్థాయిలో నిధులు విడుదల చేసిందని భట్టి తెలిపారు. కేవలం తొమ్మిది రోజుల్లోనే ఎనిమిది ఎకరాల వరకు భూమి ఉన్న రైతులందరికీ రూ.8,759 కోట్లను జమ చేశామని చెప్పారు. ఇప్పుడు రైతు ఆశీర్వాద సభ వేదికగా మరో రూ.1,900 కోట్లను విడుదల చేసి, తొమ్మిది నుంచి 50 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు కూడా రైతు భరోసా అందజేయనున్నట్లు వెల్లడించారు.

పదేళ్ల  బీఆర్ఎస్ పాలనను కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుతో పోల్చిన భట్టి విక్రమార్క, బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో రైతు భరోసా పేరుతో సుమారు రూ.75 వేల కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రెండున్నరేళ్లలోనే రూ.35 వేల కోట్లను రైతులకు అందించిందని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం విషయంలో తమ ప్రభుత్వ నిబద్ధతకు ఇదే నిదర్శనమని అన్నారు.

వ్యవసాయ రంగంపై గత ప్రభుత్వ వైఖరిని కూడా భట్టి ప్రశ్నించారు. ప్రకృతి విపత్తుల వల్ల పంటలు దెబ్బతిన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా పంట నష్టపరిహారం ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని, పంట పెట్టుబడి సహాయం, ఇతర సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సవాళ్లతో ఉన్నప్పటికీ రైతులకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం ఎక్కడా వెనక్కి తగ్గలేదని భట్టి పేర్కొన్నారు. వ్యవసాయాన్ని లాభసాటి రంగంగా మార్చేందుకు సాగునీరు, విద్యుత్, పెట్టుబడి సాయం, మార్కెటింగ్ వంటి అన్ని అంశాల్లో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు.

రైతు ఆశీర్వాద సభ ద్వారా ప్రభుత్వం రైతులకు మరిన్ని శుభవార్తలు ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ సభను కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమ కార్యక్రమాలకు ప్రతీకగా నిర్వహిస్తుండగా, భారీ సంఖ్యలో రైతులు హాజరుకావాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.

జూలై 9న రైతు మేళా

జులై 10న జరిగే రైతు ఆశీర్వాద సభకు ఒక రోజు ముందుగా జగన్నాధపురంలో జూలై 9న రైతు మేళా నిర్వహించనున్నారు. ఈ మేళాలో వ్యవసాయ సాంకేతిక ఆవిష్కరణలు, పంటల వైవిధ్యం, సేంద్రీయ వ్యవసాయం, వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించడం వంటి సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రదర్శిస్తారు. కలెక్టర్ దివాకర టిఎస్ జగన్నాథపురంలో కార్యక్రమాల ఏర్పాట్లను సమీక్షించారు.

Leave A Reply

Your email address will not be published.