కాళేశ్వరంపై బీజేపీ, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం: సీఎం రేవంత్‌రెడ్డి

  • ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టే కుట్ర
  • కాళేశ్వరంపై బీజేపీ, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం
  • వాస్తవాలు ప్రజలకు చెబుతున్నాం: సీఎం రేవంత్‌రెడ్డి
  • మాజీ మంత్రి హరీశ్‌రావు సూచనల మేరకే ఎంపీ ఈటల వ్యాఖ్యలు
  • కాళేశ్వరంపై ఈటల అవాస్తవాలు చెప్పారని..
    ఆ వ్యాఖ్యలతో తన గౌరవం కోల్పోయారని విమర్శ
  • మేడిగడ్డ లోపాలు కేసీఆర్ హయాంలోనే బయటపడ్డాయని స్పష్టీకరణ 
  • ప్లానింగ్‌, డిజైన్‌, నిర్మాణం, నిర్వహణలో లోపాలున్నాయని విమర్శ
  • కేసీఆర్‌, హరీశ్‌రావు అబద్ధపు ప్రచారం మానుకోవాలని సీఎం సూచన
  • 2020లోనే ఇంజినీర్లు హెచ్చరించినా బీఆర్ఎస్ పట్టించుకోలేదన్న ఆరోపణ
  • నిర్లక్ష్యంతోనే లోపాలు పెరిగి మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందని వ్యాఖ్య
  • మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు నీటి నిల్వకు అనుకూలం ఎన్డీఎస్ఏ నివేదిక

హైదరాబాద్ వెలుతురు జూలై 11:

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తమ ప్రభుత్వంపై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కలిసి దుష్ప్రచారం చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. మాజీ మంత్రి హరీశ్‌రావు సూచనల మేరకే ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈటల చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని, ఆయనపై తమకు వ్యక్తిగతంగా గౌరవం ఉన్నప్పటికీ ఆ వ్యాఖ్యలతో తన గౌరవాన్ని తానే తగ్గించుకున్నారని అన్నారు.

శనివారం సచివాలయంలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన సీఎం రేవంత్‌రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాలను వివరించారు. ప్రజలకు వాస్తవాలను తెలియజేయడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. 2019 జూన్‌ 21న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించారని గుర్తుచేశారు.

ప్రాజెక్టు ప్రారంభమైన కొద్ది నెలల్లోనే మేడిగడ్డ బ్యారేజ్‌లో నిర్మాణ లోపాలు బయటపడ్డాయని సీఎం తెలిపారు. 2020 మే 18న అప్పటి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రమణారెడ్డి ప్రభుత్వానికి లేఖ రాసి బ్యారేజ్‌లో ఉన్న లోపాలను గుర్తించి వెంటనే సరిదిద్దాలని సూచించారని వెల్లడించారు. అప్పటికే ఇంజినీర్లు పలు సాంకేతిక సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు.

నిర్మాణంలో ఉన్న లోపాలను సకాలంలో సరిచేయకపోవడంతో సమస్యలు మరింత తీవ్రరూపం దాల్చాయని సీఎం చెప్పారు. 2022 జూలై 14న వరదల కారణంగా కన్నెపల్లి పంప్‌హౌస్ దెబ్బతిందని, ఇప్పటి వరకు అది పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాలేదని పేర్కొన్నారు. అనంతరం 2023 అక్టోబర్‌ 21న మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం ప్రాజెక్టులోని లోపాలను బహిర్గతం చేసిందని అన్నారు.

మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు ఘటన తర్వాత కాదు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జాతీయ డ్యామ్ భద్రతా సంస్థ (ఎన్డీఎస్ఏ) కమిటీని ఏర్పాటు చేశారని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు నీటి నిల్వకు అనుకూలంగా లేవని ఎన్డీఎస్ఏ తన ప్రాథమిక, తుది నివేదికల్లో స్పష్టంగా పేర్కొందని తెలిపారు. ప్రాజెక్టు ప్లానింగ్‌, డిజైనింగ్‌, నిర్మాణం, నిర్వహణలో తీవ్ర లోపాలు ఉన్నాయని నిపుణుల కమిటీ తేల్చిందని చెప్పారు.

ఎన్డీఎస్ఏ నివేదికలో సూచించిన లోపాలను సరిచేయాలని నిపుణులు పదేపదే సూచించినప్పటికీ అప్పటి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని సీఎం ప్రశ్నించారు. ప్రారంభ దశలోనే సమస్యలను పరిష్కరించి ఉంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదని అన్నారు. అధికారుల హెచ్చరికలు, నిపుణుల సూచనలను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే ప్రాజెక్టుకు నష్టం వాటిల్లిందని ఆరోపించారు.

ప్రస్తుతం తమ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి అంశాన్ని పారదర్శకంగా ప్రజల ముందుకు తీసుకొస్తోందని సీఎం తెలిపారు. వాస్తవాలను దాచిపెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం అంశంలో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తిప్పికొడుతుందని చెప్పారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు తమ ప్రభుత్వంపై పదేపదే అసత్య ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వాస్తవాలను ప్రజలకు వివరించడం తమ బాధ్యత అని, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో నిజానిజాలు బయటపెట్టేందుకు ప్రభుత్వం వెనుకాడబోదని స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.