హైదరాబాద్ వెలుతురు జూలై 11:
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని దైవాలగూడలో చోటుచేసుకున్న దారుణ హత్యల ఘటనపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
రాజస్థాన్ పర్యటనలో ఉన్న మంత్రి సీతక్కకు ఘటన గురించి సమాచారం అందిన వెంటనే ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషితో ఫోన్‌లో మాట్లాడి సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేసు దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో కూడా మంత్రి సీతక్క ప్రత్యేకంగా మాట్లాడారు. బాధిత కుటుంబానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని, మానసిక, సామాజిక పరమైన తోడ్పాటు కల్పించాలని ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
ఇలాంటి అమానుష ఘటనలు సమాజాన్ని కలచివేస్తాయని పేర్కొన్న మంత్రి సీతక్క, మహిళలు, పిల్లలు, కుటుంబాల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. నేరాలకు పాల్పడే వారెవరైనా చట్టం నుంచి తప్పించుకోలేరని, బాధితులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
