- యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ
- పూర్ణకుంభం స్వాగతం పలికిన అర్చకులు, పూజా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి
- ఛైర్మన్, సభ్యుల ప్రమాణస్వీకారం తర్వాత వారికి శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి
- యాదగిరి గుట్ట దేవస్థానాన్ని దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా, రాష్ట్రానికి తలమానికంగా తీర్చిదిద్దేలా కృషి చేయాలని నూతన ట్రస్ట్ బోర్డుకు సూచించిన మంత్రి
- యాదగిరిగుట్ట దేవస్థానానికి తొలి పాలకమండలిగా ఛైర్మన్, సభ్యులు పై వుండే అంచనాలకు అనుగుణంగా పనిచేయాలని వారికి సూచించిన మంత్రి సురేఖ
యాదగిరిగుట్ట వెలుతురు జూలై 11:
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆశయాల మేరకు యాదగిరిగుట్టను దేశంలోనే అత్యుత్తమ ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు శ్రీమతి కొండాసురేఖ గారు యాదగిరిగుట్ట నూతన పాలకమండలికి సూచించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం దేవస్థానం ఖ్యాతిని మరింత పెంచే బాధ్యత నూతన పాలక మండలిపై ఉందని వారు పాలకమండలికి దిశానిర్దేశం చేశారు.
శనివారం రోజున యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణస్వీకారోత్సవంలో మంత్రి కొండా సురేఖగారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, ట్రస్ట్ బోర్డు ఎక్స్ అఫీషియో సభ్యులు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
దేవస్థానానికి చేరుకున్న మంత్రిగారికి ఆలయ అర్చకులు సంప్రదాయరీతిలో పూర్ణకుంభ స్వాగతం పలికారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్ని తర్వాత వేదపండితులు మంత్రి సురేఖ గారికి వేదాశీర్వచనం చేశారు. ఆలయ ఈవో భవానీ శంకర్ మంత్రి సురేఖ గారికి లక్ష్మీ సమేత నరసింహస్వామి వారి చిత్రపటాన్ని బహూకరించారు. ఛైర్మన్ ఎం. సత్యనారాయణ రెడ్డితో పాటు హాజరైన పాలక మండలి సభ్యులు ఆలయ ముఖమండపం ప్రాంగణంలో మంత్రి సురేఖ గారి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసి, అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా మంత్రి సురేఖగారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదన్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత పెంపొందిస్తూ, దేశవ్యాప్తంగా భక్తులకు ఆదర్శ క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు నూతన పాలక మండలి సమిష్టిగా కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఛైర్మన్, సభ్యులు అంకితభావంతో పనిచేస్తూ ఆలయ అభివృద్ధి, పారదర్శక పాలన, భక్తులకు మరిన్ని సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి సూచించారు. ఆలయ పవిత్రత, సంప్రదాయాలను కాపాడుతూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని, పాలక మండలి సభ్యులందరూ సమన్వయంతో పనిచేసి దేవస్థానం మరింత అభివృద్ధి చెందేలా కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.
