హైదరాబాద్ వెలుతురు జూలై 14:
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం (73) హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ ఈరోజు (మంగళవారం) సాయంత్రం 6 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన కొంతకాలంగా కిడ్నీ, శ్వాసకోశ సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ 16న హైదరాబాద్ మాదాపూర్‌లోని సింధు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ముద్రగడ పద్మనాభం తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో 1953 జనవరి 22న జన్మించారు. ఆయన 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తన జీవిత కాలంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా, ఒకసారి కాకినాడ ఎంపీగా పని చేశారు. ఆయనకు ముఖ్యం కాపు ఉద్యమ నేతగా మంచి గుర్తింపు లభించింది.
పిఠాపురం ఛాలెంజ్ & పేరు మార్పు
2024 అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను ఓడించడంలో విఫలమైతే తన పేరును పద్మనాభం నుండి పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని ముద్రగడ ప్రకటించి వార్తల్లో నిలిచారు.
అయితే, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వంగా గీతపై పవన్ కళ్యాణ్ 70,279 ఓట్ల మెజారిటీతో ఆ స్థానాన్ని గెలుచుకున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం, తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానని, తన పేరు మార్చుకోవడానికి న్యాయపరమైన ప్రక్రియను ప్రారంభిస్తానని ముద్రగడ ప్రకటించి 2024 జూన్ 20న అధికారికంగా తన పేరును ముద్రగడ పద్మనాభం నుండి ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు.
