- హైదరాబాద్‌లో ఓటరు సవరణ ప్రక్రియ కేవలం 21 శాతమే పూర్తైందని వెల్లడి
- మరో 10 రోజుల గడువు సరిపోదని.. అదనపు సమయం ఇవ్వాలని విజ్ఞప్తి
- బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లడం లేదని, ఫారాలు అందించడం లేదని ఫిర్యాదులు
- విద్యార్థులు, టీచర్లు, జీహెచ్‌ఎంసీ సహకారంతో ప్రక్రియ వేగవంతం చేయాలని సూచన
- అర్హత ఉన్న ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తొలగిపోకూడదని స్పష్టం
- ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని పిలుపు
- రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డిని కలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్ వెలుతురు జూలై 14:
తెలంగాణలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటరు సవరణ ప్రక్రియ గడువును పొడిగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డిని హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నేతలు కలిసి కోరారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్‌లోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటరు సవరణ ప్రక్రియ నత్తనడకన సాగుతోందన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లాలో సగటున కేవలం 21 శాతం మాత్రమే ప్రక్రియ పూర్తైందని తెలిపారు. మిగిలిన 10 రోజుల గడువు సరిపోదని, మరింత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు.
హైదరాబాద్‌లో సుమారు 4,500 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, పట్టణ ప్రాంతాల్లో ఓటరు సవరణ ప్రక్రియ ఆశించిన స్థాయిలో జరగడం లేదన్నారు. బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లడం లేదని, ఫారాలు సక్రమంగా అందించడం లేదని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు.
ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది సహకారాన్ని వినియోగించాలని ఎన్నికల కమిషన్‌ను కోరినట్లు మంత్రి తెలిపారు. బీఎల్‌వోలకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు లేకుండా చెల్లింపులు కూడా చేసినట్లు చెప్పారు.
అర్హత కలిగిన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తప్పిపోకూడదని, అందుకే ఎస్‌ఐఆర్ గడువును పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నామని పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే బాధ్యత అందరిదని, హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వచ్చే రోజుల్లో క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు శ్రీ గణేష్, నవీన్ యాదవ్, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్, డీసీసీ అధ్యక్షులు దీపక్ జాన్, మోత రోహిత్, టీపీసీసీ ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేటర్ కమిటీ చైర్మన్ రాజేష్‌తో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
