రెడ్కో డీఈ ముత్యం వెంకటరమణ ఇంట్లో ఏసీబీ సోదాలు

  • వందల కోట్ల అక్రమాస్తుల చిట్టా రట్టు
  • అవినీతి అధికారులపై బిగుస్తున్న ఏసీబీ ఉచ్చు
  • ఏడాది కాలంగా ఆదాయానికి మించిన ఆస్తులపై నిఘా
  • హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఏకకాలంలో తనిఖీలు
  • 10 ప్రాంతాల్లో జల్లెడ పట్టిన‌ అవినీతి నిరోధక శాఖ
  • అధికారి భార్య పేరిట భారీగా అపార్ట్‌మెంట్లు, బిల్డింగ్స్
  • బహిర్గతమైన విలాసవంతమైన ప్లాట్ల వివరాలు

హైదరాబాద్, జూన్ 22 (వెలుతురు):

తెలంగాణలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. గత గత ఏడాది కాలంగా ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఏసీబీ, వరుస దాడుల చేస్తోంది. ఈ క్రమంలో భారీ మొత్తంలో అక్రమ సొత్తు వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుని వివిధ శాఖల్లో కీలక పదవుల్లో ఉంటూ అక్రమాలకు పాల్పడిన అధికారుల ఆస్తుల చిట్టా రట్టవుతుండటం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఇటీవల కాలంలో ఇంజనీరింగ్, రెవెన్యూ, పోలీస్ వంటి వివిధ శాఖల్లో తనిఖీలు చేపట్టిన ఏసీబీ అనేక ప్రాంతాల్లో అవినీతి అధికారుల అక్రమ ఆస్తుల చిట్టా 100 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా.

తెలంగాణలో మరో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీఖాన్ ఆధ్వర్యంలో  తెలంగాణ రెన్యూవబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (రెడ్కో) డీఈ ముత్యం వెంకటరమణ ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే విశ్వసనీయ సమాచారంతో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం తెల్లవారుజాము నుంచే ఆయన నివాసంతో పాటు కార్యాలయం, బంధువులు, సహచరులకు చెందిన పలు ప్రాంతాల్లో ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించారు.

డీఈ ముత్యం వెంకటరమణ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాల్లో నగదు, డైమండ్స్, బంగారు, వెండి ఆభరణాలతో పాటు కమర్షియల్ బిల్డింగ్స్​, నాలుగు రెసిడెన్సియల్  ప్లాట్లను గుర్తించారు. వెంకటరమణ భార్య పేరిట రెసిడెన్సిషన్​ అపార్టుమెంట్  నిర్మాణాలను  గుర్తించారు. ఉదయం నుంచి మొత్తంగా 10 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. మూసాపేట ఆంజనేయనగర్‌లో 20 కోట్ల అంచనా పెట్టుబడితో నిర్మాణంలో ఉన్న 10 నివాస అపార్ట్‌మెంట్లు, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి ప్రాంతాల్లో అధికారిక విలువ ప్రకారమే 1.23 కోట్ల విలువైన 4 ఫ్లాట్లు, కూకట్‌పల్లి ఆంజనేయనగర్‌లో 1.82 కోట్ల విలువైన G+3 వాణిజ్య సముదాయం, గుట్టల బేగంపేటలో 2.90 కోట్ల విలువైన G+5 కమర్షియల్ బిల్డింగ్‌ ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

సోదాల సందర్భంగా వెంకటరమణ ఇల్లు, ఇతర ప్రాంగణాల నుంచి భారీగా ప్రాపర్టీ పత్రాలు, నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 4 కోట్ల విలువైన 2.094 కిలోల బంగారు ఆభరణాలు, 52.02 లక్షల బ్యాంక్ డిపాజిట్లు, 45 లక్షల విలువైన 3 విలువైన కార్లు, 30 లక్షల విలువైన గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు 20 మద్యం సీసాలను ఏసీబీ బృందాలు సీజ్ చేశాయి.

 

 

Leave A Reply

Your email address will not be published.