- ఏఐసీసీ పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన జ్వాలలు
- హైదరాబాద్‌లో ‘చలో లోక్‌భవన్’ ముట్టడి
- నెక్లెస్ రోడ్డు నుంచి లోక్‌భవన్ వరకు సంకెళ్లతో ర్యాలీ
- పాల్గొన్న పీసీసీ అధ్యక్షుడు, మంత్రులు, ప్రజాప్రతినిధులు
- లోక్‌భవన్ సమీపంలో పోలీసుల ఆంక్షలు
- తీవ్ర తోపులాట: అదనపు బలగాల మోహరింపు
- తీవ్ర ఉద్రిక్తత.. పీసీసీ చీఫ్, మంత్రుల అరెస్ట్!
- నాంపల్లి, పంజాగుట్ట పోలీసు స్టేషన్లకు తరలింపు
హైదరాబాద్, జూన్ 22 (వెలుతురు):
దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలతో పాటు ఇతర ముఖ్య నేతల అరెస్టును నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ఇచ్చిన పిలుపు మేరకు రాజధాని హైదరాబాద్‌లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఆధ్వర్యంలో చేపట్టిన “చలో లోక్‌భవన్” ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ ముఖ్య నేతలు, భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు లోక్‌భవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.
హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో ఉన్న ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నుంచి లోక్‌భవన్ వరకు ఈ నిరసన ప్రదర్శన ప్రారంభమైంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, అజారుద్దీన్, ఎమ్మెల్యే దానం నాగేందర్, ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా నాయకులు చేతులకు సంకెళ్లు వేసుకుని వినూత్న రీతిలో తమ నిరసనను తెలిపారు.
కాంగ్రెస్ ర్యాలీ నేపధ్యంలో నెక్లెస్ రోడ్డు నుంచి లోక్‌భవన్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ముందస్తుగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ప్రారంభమైన ర్యాలీ లోక్‌భవన్ సమీపంలోని ప్రధాన కూడలికి చేరుకోగానే, పోలీసులు ఏర్పాటు చేసిన మూడంచెల బారికేడ్లతో అడ్డుకున్నారు. పోలీసుల ఆంక్షలను దాటుకుని ముందుకు వెళ్లేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించడంతో తీవ్ర తోపులాట జరిగి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి అదనపు బలగాలను, మహిళా కానిస్టేబుళ్లను రప్పించి రక్షణను మరింత పెంచారు.
పరిస్థితి చెయ్యిదాటి పోకుండా చూసేందుకు పోలీసులు ర్యాలీని అడ్డుకుని ప్రధాన నాయకులను అదుపులోకి తీసుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, మహమ్మద్ అజారుద్దీన్, షబీర్ అలీ తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. పీసీసీ అధ్యక్షుడిని, మంత్రులను నాంపల్లి పోలీసు స్టేషన్‌కు, ఇతర ముఖ్య నేతలను పంజాగుట్ట పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం కొద్దిసేపటికి వారందరినీ సొంత పూచీకత్తుపై పోలీసులు విడుదల చేశారు.
పోలీసు అరెస్టు అనంతరం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఢిల్లీలో రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్టు చేశారని, మహిళ అని కూడా చూడకుండా ప్రియాంకా గాంధీ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించి అరెస్ట్ చేశారని మండిపడ్డారు. దేశంలో ప్రధాని మోదీ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పూర్తిగా మంటగలుపుతున్నారని ఆరోపించారు. నీట్ పరీక్షల అక్రమాలపై సమాధానం చెప్పలేక, బాధ్యత వహించాల్సిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకుండా తప్పించుకుంటున్నారని, పోలీసు బలగాలతో రాజ్యాంగాన్ని నడుపుతామంటే దేశ ప్రజలు సహించరని హెచ్చరించారు.




ఏఐసీసీ పిలుపు మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా హనుమకొండ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఆయనతో పాటు రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక కాంగ్రెస్ నాయకులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తోందని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క విమర్శించారు.

ఖమ్మం నగరంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించాయి. ఖమ్మం కాంగ్రెస్ జిల్లా కార్యాలయం నుంచి ఆమోదించబడిన మార్గం గుండా అంబేద్కర్ కూడలి వరకు ఈ ప్రదర్శన సాగింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ ర్యాలీకి నేతృత్వం వహించారు. హైదరాబాద్‌లోనే కాకుండా తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లోనూ కాంగ్రెస్ శ్రేణులు రాహుల్ గాంధీ అరెస్ట్‌కు నిరసనగా ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించాయి.
