కనీస వేతన చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి

 

సెక్యూరిటీ, శానిటేషన్, హౌస్‌కీపింగ్ సిబ్బందికి న్యాయం చేయాలి: సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ

హైదరాబాద్, వెలుతురు, సెప్టెంబర్ 5: ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు వివిధ సంస్థల్లో పనిచేస్తున్న సెక్యూరిటీ, శానిటేషన్, హౌస్‌కీపింగ్ సిబ్బందికి న్యాయం జరిగేలా కనీస వేతన చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీకాంత్ డి. జాదవ్, వైస్ చైర్మన్ మురారి గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఐదు లక్షలకు పైగా సెక్యూరిటీ సిబ్బంది, సుమారు మూడు లక్షల మంది హౌస్‌కీపింగ్, శానిటేషన్ కార్మికులు పనిచేస్తున్నారని, కనీస వేతన చట్టం సక్రమంగా అమలు కాకపోవడం వల్ల లక్షలాది మంది తీవ్రంగా నష్టపోతున్నారని వారు తెలిపారు.

చట్టప్రకారం అర్హత ఉన్న సిబ్బందికి నిర్ణయించిన కనీస వేతనాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కార్మికులకు రక్షణ కల్పించే చట్టాలను సమర్థవంతంగా అమలు చేయకుండా, వారికి ఇబ్బందులు కలిగించే నిబంధనలను అమలు చేయాలని ఒత్తిడి చేయడం సరికాదని పేర్కొన్నారు. సెక్యూరిటీ సిబ్బంది రోజుకు 12 గంటలకు పైగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ, వారి వేతనాలు, పని పరిస్థితుల విషయంలో తగిన శ్రద్ధ చూపడం లేదని అసోసియేషన్ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల కష్టాలను, గుర్తింపు లేని ఏజెన్సీల దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ సమస్యపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిసి పలుమార్లు వినతులు సమర్పించినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితం లభించలేదని వారు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం లక్షలాది కార్మిక కుటుంబాలకు ప్రయోజనం చేకూరేలా తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. కనీస వేతన చట్టం అమలుపై సంబంధిత శాఖలు, ప్రధాన సెక్యూరిటీ ఏజెన్సీలు, అసోసియేషన్లకు స్పష్టమైన ఆదేశాలు, నోటీసులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తే అసోసియేషన్ తరఫున పూర్తి సహకారం అందిస్తామని, నిబంధనలు పాటించని సంస్థలు, ఏజెన్సీలను గుర్తించి ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తామని తెలిపారు.

ఈ సమావేశంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఎస్. శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బాలరాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీ దినేష్, ట్రెజరర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.