గోదావరిఖనిలో కత్తులతో పొడిచి సింగరేణి ఉద్యోగి హత్య
పెద్దపల్లి జిల్లా, నవంబర్ 23 : గోదావరిఖని పట్టణంలో దారుణ హత్య చోటుచేసుకుంది. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న అట్ల రాజశేఖర్ (30) అనే ఉద్యోగిని గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి హత్య చేశారు. సోమవారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో ఈ ఘటన జరగడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.
వివరాల్లోకి వెళితే.. గోదావరిఖనిలోని పవర్‌హౌస్ కాలనీకి చెందిన రాజశేఖర్‌కు అర్ధరాత్రి సమయంలో ఫోన్ వచ్చింది. దీంతో ఆయన ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు సమాచారం. అప్పటికే అక్కడ మాటువేసిన నలుగురు యువకులు ఒక్కసారిగా కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన రాజశేఖర్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న గోదావరిఖని వన్‌టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సీసీ కెమెరాల ఫుటేజీ, ఫోన్‌కాల్ వివరాల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.
