వరుసగా 10 ఏళ్ల పాటు రోజుకొక వికీ వ్యాసం 3652 రోజుల నిరంతర ప్రయాణం
కొచ్చి, కేరళ, వెలుతురు, సెప్టెంబర్ 6:
ఉచిత సమాచార విజ్ఞానాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో తెలుగు వికీపీడియన్, యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్‌కు చెందిన ప్రణయ్‌రాజ్ వంగరి అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించారు. వరుసగా 10 ఏళ్ల పాటు (3,652 రోజులు) ప్రతిరోజూ ఒక వికీపీడియా వ్యాసం చొప్పున రాస్తూ ఈ ఘనత సాధించిన తొలి వికీపీడియన్‌గా చరిత్ర సృష్టించారు.
ప్రణయ్‌రాజ్ వంగరి 2016 సెప్టెంబర్ 8న రోజుకొక వ్యాసం రాయడం ప్రారంభించి 2026 సెప్టెంబర్ 7 నాటికి ఎలాంటి విరామం లేకుండా 10 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేశారు. ఈ కాలంలో తెలుగు వికీపీడియాలో 11,500కు పైగా కొత్త వ్యాసాలను ఆయన సృష్టించారు.
100 వ్యాసాలతో ప్రారంభమైన ప్రస్థానం
‘100 రోజులు – 100 వికీ వ్యాసాలు’ ఛాలెంజ్‌తో ప్రారంభమైన ఆయన ప్రయాణం క్రమంగా ప్రపంచ రికార్డు స్థాయికి చేరుకుంది. 2016 సెప్టెంబర్ 8 నుంచి డిసెంబర్ 16 వరకు 100 రోజుల పాటు ప్రతిరోజూ ఒక వ్యాసం రాస్తూ తొలి లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేశారు.
అనంతరం 2017 సెప్టెంబర్ 7 నాటికి 365 రోజులు – 365 వ్యాసాలు పూర్తి చేసి ‘వికీవత్సరం’ను సాధించారు. ఈ ఘనత సాధించిన తొలి వికీపీడియన్‌గా ఆయన గుర్తింపు పొందారు. అప్పటి భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ట్విట్టర్ ద్వారా ప్రణయ్‌రాజ్‌ను అభినందించారు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ట్విట్టర్, ఫేస్‌బుక్ ద్వారా అభినందించడంతో పాటు ప్రగతి భవన్‌లో సత్కరించారు.
వరుస మైలురాళ్లు
100 రోజులు – 100 వ్యాసాలు: 2016 సెప్టెంబర్ 8 నుంచి డిసెంబర్ 16 వరకు పూర్తి చేశారు.
365 రోజులు – 365 వ్యాసాలు: 2017 సెప్టెంబర్ 7 నాటికి ‘వికీవత్సరం’ పూర్తి చేసి ప్రత్యేక గుర్తింపు పొందారు.
1000 రోజులు – 1000 వ్యాసాలు: 2019 జూన్ 4 నాటికి వరుసగా 1,000 రోజులు పూర్తి చేశారు.
1500 రోజులు – 1500 వ్యాసాలు: 2020 అక్టోబర్ 17 నాటికి 1,500 రోజుల మైలురాయిని అధిగమించారు.
2000 రోజులు – 3,015 వ్యాసాలు: 2022 మార్చి 1 నాటికి 2,000 రోజుల నిరంతర రచనా ప్రస్థానాన్ని పూర్తి చేశారు.
10 ఏళ్ల ప్రపంచ రికార్డు: 2016 సెప్టెంబర్ 8 నుంచి 2026 సెప్టెంబర్ 7 వరకు 3,652 రోజుల పాటు ప్రతిరోజూ వికీపీడియా వ్యాసం రాస్తూ, 11,500కు పైగా కొత్త వ్యాసాలను సృష్టించారు.
తెలంగాణ ప్రభుత్వ ఐటీ శాఖ నుంచి అవార్డు
ప్రణయ్‌రాజ్ సేవలను గుర్తిస్తూ 2018 తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా జూన్ 1న తెలంగాణ ప్రభుత్వ సమాచార సాంకేతిక శాఖ నిర్వహించిన వార్షిక నివేదిక కార్యక్రమంలో అప్పటి మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ‘లోకలైజేషన్ (స్థానికీకరణ)’ విభాగంలో తొలి అవార్డు అందుకున్నారు.
కొచ్చిలో ఘన సత్కారం
ప్రణయ్‌రాజ్ వంగరి 10 ఏళ్ల నిరంతర వికీపీడియా రచనా ప్రస్థానాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 6న కేరళలోని కొచ్చిలో జరిగిన వికీ కాన్ఫరెన్స్ ఇండియా–2026లో ప్రత్యేక సత్కార కార్యక్రమం నిర్వహించారు.
తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సభ్యులు లోరెంజో లోసా, విక్టోరియా డోరోనినా పాల్గొని ప్రణయ్‌రాజ్ వంగరిని జ్ఞాపిక, శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు వికీమీడియన్లు విజే సుశీల, కృపాల్ కశ్యప్, పవన్ సంతోష్, నేతి సాయికిరణ్, దివ్య, బత్తిని వినయ్ కుమార్ గౌడ్‌తో పాటు ఇతర భాషలకు చెందిన సుమారు 250 మంది వికీమీడియన్లు పాల్గొని ప్రణయ్‌రాజ్‌ను అభినందించారు.
తెలుగు భాషలో ఉచిత సమాచారాన్ని విస్తరించడంలో ప్రణయ్‌రాజ్ వంగరి చేసిన కృషి, నిరంతర రచనా నిబద్ధత తెలుగు వికీపీడియా చరిత్రలోనే కాకుండా ప్రపంచ వికీపీడియా సమాజంలోనూ ప్రత్యేకంగా నిలిచే ఘనతగా పలువురు అభివర్ణించారు.
