పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, వెలుతురు, సెప్టెంబర్ 5:
రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2026’కు సంబంధించిన ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. శనివారం ఆబిడ్స్‌లోని ఇండస్ట్రీస్ డైరెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో సమ్మిట్ ఏర్పాట్లు, రోడ్‌షోలు, ఎంవోయూలు, లాజిస్టిక్స్, ప్రోటోకాల్, హాస్పిటాలిటీ తదితర అంశాలపై ఆయన సమీక్షించారు.
ప్రపంచస్థాయి పెట్టుబడులను తెలంగాణకు ఆకర్షించి, కొత్త పరిశ్రమల ఏర్పాటుతో రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ సంకల్పమని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ లక్ష్య సాధనలో గ్లోబల్ సమ్మిట్‌ను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రతిష్ఠను మరింత ఇనుమడింపజేసేలా ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2026’ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణను పెట్టుబడులకు మరింత ఆకర్షణీయ గమ్యస్థానంగా తీర్చిదిద్దడంతో పాటు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిచే విధంగా పలు కొత్త పాలసీలను ఆవిష్కరించేందుకు కసరత్తు చేస్తున్నట్లు వివరించారు.
ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ బ్రాండ్‌కు ప్రచారం
తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ను అంతర్జాతీయ స్థాయిలో మరింత బలోపేతం చేసేలా దేశీయ, విదేశీ పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా వివిధ ప్రాంతాల్లో రోడ్‌షోలు నిర్వహించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు. సమ్మిట్ వేదికగా తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమైన పరిస్థితులపై పారిశ్రామికవేత్తలకు విస్తృత అవగాహన కల్పించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
ఎంవోయూల అమలుపై ప్రత్యేక దృష్టి
గతంలో కుదిరిన, భవిష్యత్తులో సమ్మిట్ సందర్భంగా కుదిరే ఎంవోయూలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో అమలయ్యేలా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి ఎంవోయూపై ఎప్పటికప్పుడు పకడ్బందీగా ఫాలోఅప్ నిర్వహిస్తూ, పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే రంగాలకు గ్లోబల్ సమ్మిట్‌లో అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
డెలిగేట్లకు అత్యుత్తమ సౌకర్యాలు
విదేశీ ప్రతినిధులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా లాజిస్టిక్స్, ప్రోటోకాల్, హాస్పిటాలిటీ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి తెలిపారు. సమ్మిట్ ఏర్పాట్లలో శాఖల మధ్య సమన్వయం లోపించకుండా ప్రతి శాఖకు స్పష్టమైన బాధ్యతలు, నిర్దిష్ట టైమ్‌లైన్లు కేటాయించినట్లు చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. సమ్మిట్ ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ, నిర్దేశిత గడువులోగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసేలా ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
