హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శమీ పూజ నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, వెలుతురు, అక్టోబర్ 20 : విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ సంప్రదాయబద్ధంగా శమీ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా శమీ వృక్షానికి ప్రత్యేక పూజలు చేసి, అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం భద్రతా సిబ్బంది ఆయుధాలకు ఆయుధ పూజ నిర్వహించారు. విజయదశమి పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని పేర్కొన్నారు. ప్రజలందరికీ విజయాలు, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, ప్రజా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగాలని ప్రార్థించారు. దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఆశలు, ఆనందాలు నింపాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మంత్రి ఆకాంక్షించారు. ప్రజలందరూ విజయదశమి పండుగను భక్తిశ్రద్ధలతో, సోదరభావంతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి, వైస్ చైర్మన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.
