మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్టీసీ యూనియన్ నేతలు
హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 22:
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను టీడబ్ల్యూయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్, ఎస్‌డబ్ల్యూయూ కూటమి నేతలు హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను ప్రారంభించాలని యూనియన్ నేతలు మంత్రిని కోరారు.
అదేవిధంగా పదవీ విరమణ చేసిన ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గతంలో పెండింగ్‌లో ఉన్న బకాయిలను చెల్లించడంతో పాటు, పదవీ విరమణ చేసిన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
యూనియన్ నేతల విజ్ఞప్తిపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్.. పదవీ విరమణ చేసిన ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. వారికి గతంలో రావాల్సి ఉన్న పెండింగ్ బకాయిలను చెల్లించే అంశంపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో టీడబ్ల్యూయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్, ఎస్‌డబ్ల్యూయూ కూటమి నేతలు అశ్వద్ధామ రెడ్డి, రాజిరెడ్డి, వి.ఎస్.రావు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
