కొమురం భీం, పండుగ సాయన్న ఆశయాల సాధనకు కృషి: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 22
ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన కొమురం భీం, పేదలు, బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన పండుగ సాయన్న ముదిరాజ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే వారికి అందించే ఘనమైన నివాళి అని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. అసెంబ్లీలోని దుద్దిళ్ల శ్రీపాదరావు సెంట్రల్ హాల్లో పండుగ సాయన్న ముదిరాజ్ 174వ, కొమురం భీం 125వ జయంతి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ పాల్గొన్నారు.
కొమురం భీం ఆదివాసీల ఆరాధ్య దైవమని, ఆయన అందించిన ‘జల్, జంగల్, జమీన్’ నినాదం ఆదివాసీల హక్కుల పోరాటానికి స్ఫూర్తిగా నిలిచిందని స్పీకర్ పేర్కొన్నారు. గిరిజనుల సంక్షేమం, విద్య, ఉపాధి అవకాశాల కల్పనతో పాటు జోడేఘాట్‌ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం ద్వారా ఆయన ఆశయాల సాధనకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పండుగ సాయన్న ముదిరాజ్ పేదల పక్షాన నిలిచి, దొరల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన ప్రజా వీరుడని కొనియాడారు. పేదల సంక్షేమం, సామాజిక న్యాయమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు.
