పట్టభద్రుల ఓటరు నమోదుకు కాంగ్రెస్ క్యాంప్
హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 23 : కంటోన్మెంట్ నియోజకవర్గంలోని టీచర్స్ కాలనీ పార్క్ వద్ద హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సామ రామ్మోహన్‌రెడ్డికి మద్దతుగా పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి అజారుద్దీన్, ఎమ్మెల్యే శ్రీ గణేశ్, సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్ పాల్గొన్నారు. కార్యక్రమానికి పట్టభద్రులు పెద్ద సంఖ్యలో హాజరై ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. అర్హత కలిగిన పట్టభద్రులందరూ నవంబర్ 6వ తేదీలోపు ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. పట్టభద్రుల సమస్యలను గళమెత్తి పరిష్కరించేందుకు సామ రామ్మోహన్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిందన్నారు. నిరుద్యోగులు, ఉద్యోగులు, న్యాయవాదులు, వైద్యులు తదితర పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ కృషి చేస్తుందని తెలిపారు. ప్రతి గ్రాడ్యుయేట్ తన ఓటు హక్కును నమోదు చేసుకోవాలని, ఓటు హక్కు పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటంలో ఇది భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
