మున్నేరు–పాలేరు భూసేకరణ నిలిపివేయాలి
గార్ల మండల రైతుల డిమాండ్.. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌కు వినతి
మహబూబాబాద్, వెలుతురు, అక్టోబర్ 24 : మున్నేరు–పాలేరు లింక్ కెనాల్ నిర్మాణం కోసం ఐదో షెడ్యూల్ పరిధిలోని ఏజెన్సీ ప్రాంతంలో చేపడుతున్న భూసేకరణ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని గార్ల మండల రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ సత్యవతి రాథోడ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
భూసేకరణకు సంబంధించిన జీవో నంబర్ 98/2025, జీవో నంబర్ 07/2026లను రద్దు చేయాలని రైతులు, అఖిలపక్ష నాయకులు కోరారు. గిరిజనుల దీర్ఘకాలిక ఆకాంక్ష అయిన ముల్కనూర్ వద్ద మున్నేరు రిజర్వాయర్ నిర్మాణాన్ని చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించి జీవో నంబర్ 1076/2009 ప్రకారం పనులు ప్రారంభించి గిరిజన ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలని కోరారు.
ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ గిరిజనుల హక్కులు, భూములు, జీవనోపాధిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఏజెన్సీ ప్రాంత ప్రజల ప్రయోజనాలను విస్మరించకుండా ప్రభుత్వం తక్షణమే స్పందించి భూసేకరణ సమస్యను పరిష్కరించాలని కోరారు. గిరిజనుల ప్రయోజనాలకు అనుగుణంగా న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
