న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి నవంబర్‌లో సీఎం రేవంత్‌రెడ్డితో చర్చలు
హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 24 : రాజ్యాంగబద్ధ సంస్థలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. సీబీఐ, ఈడీ సంస్థలను ఇష్టానుసారంగా ఉపయోగించుకుంటున్నారని, ఎన్నికల సంఘాన్ని సైతం తమకు అనుకూలమైన సంస్థగా మార్చుకుంటున్నారని ఆరోపించారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి నవంబర్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ప్రత్యేకంగా చర్చిస్తామని వెల్లడించారు.
గాంధీ భవన్‌లోని ఇందిరా భవన్లో టీపీసీసీ లీగల్ సెల్ కార్యవర్గ సమావేశం చైర్మన్ అశోక్ గౌడ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ న్యాయవాద వృత్తి ఎంతో గౌరవప్రదమైనదని, అదే సమయంలో కఠినమైన బాధ్యతలతో కూడుకున్నదని అన్నారు. తాను న్యాయవాదిగా మారలేకపోయానని పేర్కొంటూ, న్యాయవాద వృత్తి నుంచి వచ్చిన అనేక మంది రాజకీయాల్లోనూ రాణించారని తెలిపారు.
దేశంలో కొన్ని న్యాయస్థానాల తీర్పులను చూసి ఆశ్చర్యం కలుగుతోందని మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. న్యాయవాదుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, వారి సమస్యలను పరిష్కరించడంతో పాటు స్టైఫండ్ల పెంపుపైనా కృషి చేద్దామని అన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకొచ్చామని గుర్తుచేశారు.
తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమాంతరంగా అమలు చేస్తున్నామని, ఇప్పటివరకు 80 వేలకు పైగా ఉద్యోగాలను కల్పించామని తెలిపారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు సామ రామ్మోహన్ రెడ్డి, సర్వోత్తమ్ రెడ్డిని గెలిపించాలని న్యాయవాదులు, పట్టభద్రులకు పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ఏఐపీసీ చైర్మన్, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్, ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డితో పాటు టీపీసీసీ లీగల్ సెల్ కార్యవర్గ సభ్యులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
