హనుమకొండ కలెక్టరేట్ ఎదుట ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరాహార దీక్ష

హనుమకొండ కలెక్టరేట్ ఎదుట ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరాహార దీక్ష

 

హనుమకొండ, వెలుతురు, అక్టోబర్ 24 :   జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ హనుమకొండ కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన నిరాహార దీక్షకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. భూపాలపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి మొక్కిరాల జనార్దన్‌రావు, పరకాల నియోజకవర్గ బాధ్యులు కందుకూరి నరేష్‌ తదితరులు దీక్షా శిబిరాన్ని సందర్శించి ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు.

 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 78 ఉద్యోగ విభాగాల్లో పనిచేస్తున్న 17 వేల మందికి పైగా ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఎలాంటి షరతులు లేకుండా క్రమబద్ధీకరణ చేపట్టడంతో పాటు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న జీతాలు, బిల్లులు చెల్లించాలని, ప్రతి నెలా ఐదో తేదీలోపు వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

 

వార్షిక వేతన పెంపుదల, విధేయతా బోనస్‌, బదిలీ సౌకర్యాలు, ప్రసూతి సెలవులు, పదవీ విరమణ ప్రయోజనాలు కల్పించాలని, ఎన్‌హెచ్‌ఎం సంయుక్త కార్యాచరణ కమిటీ ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీడీపీ నాయకులు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరపాక ప్రభాకర్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హనుమకొండ సాంబయ్య, పార్లమెంటు ఉపాధ్యక్షులు బర్ల యాకూబ్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.