ధర్మపురి బస్‌స్టేషన్ ఆధునీకరణకు శంకుస్థాపన
జగిత్యాల జిల్లా , వెలుతురు, అక్టోబర్ 25 : రూ.2.57 కోట్ల అంచనా వ్యయంతో ధర్మపురి బస్‌స్టేషన్ ఆధునీకరణ పనులకు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ శంకుస్థాపన చేశారు. ఆధునీకరణలో భాగంగా రెండు ప్లాట్‌ఫారాల విస్తరణ, గ్రానైట్ ఫ్లోరింగ్, కొత్త టాయిలెట్ బ్లాక్, సీసీ పేవ్‌మెంట్, వర్షపు నీటి పారుదల, విద్యుదీకరణతో పాటు ఇతర మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరంలోని ప్రధాన పుణ్యక్షేత్రాల బస్‌స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ధర్మపురికి బస్‌డిపో ఏర్పాటు చేయాలన్న స్థానికుల డిమాండ్‌పై స్థల సేకరణ చేసి ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే ధర్మపురి బస్‌డిపో కలను సాకారం చేస్తామని హామీ ఇచ్చారు. ధర్మపురి నుంచి ముంబైకి బస్ సర్వీస్, కరీంనగర్–జగిత్యాల–ధర్మపురి మధ్య రాత్రి సర్వీసుల ఏర్పాటును పరిశీలించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.
ప్రజా పాలనలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, రైతులకు సన్నవడ్ల బోనస్, ఉద్యోగాల భర్తీ తదితర సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని కొండగట్టు గిరి ప్రదక్షిణతో పాటు ధర్మపురి, వేములవాడ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి రాజు, లైబ్రరీ చైర్మన్ దినేష్, ఆర్టీసీ అధికారులు, ఆర్‌ఎంలు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
