మేడిగడ్డ పాపంలో కేసీఆర్, హరీశ్‌రావులకు సమాన బాధ్యత : మెట్టు సాయికుమార్
హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 25 :
గాంధీ భవన్‌లో టీపీసీసీ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ బీఆర్‌ఎస్, ఆ పార్టీ నేత హరీశ్‌రావుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బీఆర్‌ఎస్ అంటే ‘బలాదూర్ రాష్ట్ర సమితి, బేకార్ రాష్ట్ర సమితి, బట్టేబాజ్ రాష్ట్ర సమితి’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పదేళ్లపాటు రాష్ట్రాన్ని ఆగం చేసిన వారు ఇప్పుడు శ్రీరంగ నీతులు మాట్లాడుతున్నారని విమర్శించారు.
హరీశ్‌రావును ‘తన్నీరు హరీశ్‌రావు కాదు.. అబద్ధాల హరీశ్‌రావు’ అని సాయికుమార్ ఎద్దేవా చేశారు. అబద్ధాలు చెప్పడంలో హరీశ్‌రావు తన మామ కేసీఆర్‌ను మించిపోయారని, రోజుకు వంద నుంచి వెయ్యి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఏనాడూ హరీశ్‌రావు నిజాలు మాట్లాడరని విమర్శించారు.
మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్టుల వైఫల్యానికి కేసీఆర్, హరీశ్‌రావులదే బాధ్యత అని సాయికుమార్ అన్నారు. కమిషన్ల కోసం కక్కుర్తిపడి మేడిగడ్డను కూల్చేశారని ఆరోపించారు. కాళేశ్వరం, మేడిగడ్డ విషయంలో కేసీఆర్‌కు ఎంత పాపం ఉందో హరీశ్‌రావుకు కూడా అంతే బాధ్యత ఉందన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అవకతవకలు ప్రజలకు తెలియాలనే ఆ పార్టీ నేతలను మేడిగడ్డకు వెళ్లేందుకు అనుమతించామని పేర్కొన్నారు.
హరీశ్‌రావు ఎంత మోతుబరి మాటలు మాట్లాడినా బీఆర్‌ఎస్ నేతలు ఆయనను పట్టించుకోవడం లేదని సాయికుమార్ అన్నారు. నిన్న మేడిగడ్డకు వెళ్లిన బీఆర్‌ఎస్ నేతలు హరీశ్‌రావును నిలదీసి, జరిగిన విషయాలపై ప్రశ్నించాలని సూచించారు.
హరీశ్‌రావు బీఆర్‌ఎస్‌లో నంబర్–2 స్థానాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని సాయికుమార్ ఆరోపించారు. ఎగిరెగిరి దంచినా ఆయన బీఆర్‌ఎస్‌లో నంబర్–2 కాలేరని వ్యాఖ్యానించారు. సీనియర్ నేత, ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు, పద్మారావుకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యే అర్హత లేదా అని ప్రశ్నించారు.
కుత్బుల్లాపూర్‌లో వివేకానందగౌడ్ చేసిన అక్రమాలు చాలా ఉన్నాయని సాయికుమార్ ఆరోపించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, వివేకానందగౌడ్ వంటి నేతలు పార్టీకి ‘అద్దెకు వచ్చిన నాయకులు’గా మారారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌లో నాయకత్వం, అంతర్గత విభేదాలపై ఆ పార్టీ నేతలు సమాధానం చెప్పాలని సాయికుమార్ డిమాండ్ చేశారు.
