తెలంగాణ కీలక పోర్టల్ టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి
హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 25 : తెలంగాణ ప్రభుత్వానికి చెందిన కీలకమైన టీజీ-ఐపాస్ పోర్టల్‌పై సైబర్ దాడి జరిగింది. రాష్ట్రంలో పారిశ్రామిక అనుమతులను సులభతరం చేసే ఈ ‘గవర్న్‌మెంట్ టు బిజినెస్’ (జీ2బీ) ప్లాట్‌ఫారమ్ సర్వర్‌ను హ్యాకర్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. డేటాబేస్‌ను ఎన్‌క్రిప్ట్ చేయడంతో పోర్టల్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ ఘటనపై ‘తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో’ (టీజీసీఎస్‌బీ) కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.
అక్టోబరు 22న రాత్రి 11:36 గంటలకు ఈ సైబర్ దాడి జరిగినట్లు అధికారులు గుర్తించారు. పోర్టల్ అప్లికేషన్ పనిచేయకపోవడంతో టెక్నికల్ బృందం వెంటనే రంగంలోకి దిగింది. క్లౌడ్4సీ అనే సంస్థ సహకారంతో సర్వర్‌ను రీస్టార్ట్ చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. లోతుగా పరిశీలించగా.. ఎస్‌క్యూఎల్ సర్వర్ ఏజెంట్ సర్వీస్ ఆగిపోయినట్లు తేలింది. పునరుద్ధరణ ప్రయత్నాలు విఫలమవడంతో ఇది సాధారణ సాంకేతిక సమస్య కాదని, హ్యాకింగ్ జరిగిందని నిర్ధారణకు వచ్చారు.
సర్వర్‌లో మెషిన్ ఐడెంటిఫయర్‌తో కూడిన ఒక రాన్‌సమ్‌నోట్ కనిపించింది. హ్యాకర్లు తమ ఈ-మెయిల్ అడ్రస్‌ను కూడా అందులో ఉంచారు. డేటాను తొలగించకుండా, డేటాబేస్‌ను ఎన్‌క్రిప్ట్ చేసి నిలిపివేయడంతో దీనిని రాన్‌సమ్‌వేర్ దాడిగా భావిస్తున్నారు. ఈ ఘటనపై పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ సంగా సురేశ్ శనివారం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు స్వీకరించిన టీజీసీఎస్‌బీ అధికారులు, ఐటీ చట్టంలోని సెక్షన్ 43 (కంప్యూటర్ వ్యవస్థలకు నష్టం), సెక్షన్ 66 (సైబర్ నేరాలు) కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రస్తుతం టీజీ-ఐపాస్ సేవలు అందుబాటులో లేవు. హ్యాకర్లు డేటాను కాపీ చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. డేటాబేస్‌ను పూర్తిస్థాయిలో పునరుద్ధరించి, సోమవారం నాటికి సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
