కాళేశ్వరం నీటిపై బీఆర్ఎస్‌ది విషప్రచారం : ఎంపీ చామల

కాళేశ్వరం నీటిపై బీఆర్ఎస్‌ది విషప్రచారం : ఎంపీ చామల

 

హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 26 :   ఎల్‌నినో, కాళేశ్వరం ప్రాజెక్టు నీటి అంశాలపై బీఆర్ఎస్‌ రాజకీయ దుష్ప్రచారం చేస్తోందని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. సోమవారం గాంధీభవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 24 గంటలూ రాజకీయాలు చేయడమే బీఆర్ఎస్‌ లక్ష్యంగా పెట్టుకుందని, ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై నిర్మాణాత్మకంగా వ్యవహరించకుండా కేవలం విమర్శలకే పరిమితమవుతోందని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే ప్రస్తుతం తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు తమకు ఓటు వేయలేదనే కారణంతో రాష్ట్రంలో మంచి జరగకూడదనే ఉద్దేశంతో బీఆర్ఎస్‌ వ్యవహరిస్తోందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని ఎత్తిపోసేందుకు అవసరమైన నీటిమట్టం ప్రస్తుతం లేదని చామల తెలిపారు. కన్నెపల్లి నుంచి మేడిగడ్డ వరకు నీటిని ఎత్తిపోసేందుకు 93.5 మీటర్ల నీటిమట్టం అవసరం కాగా, ప్రస్తుతం 89.20 మీటర్లు మాత్రమే ఉందన్నారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల వద్ద కూడా నీటిని ఎత్తిపోసేందుకు అవసరమైన స్థాయిలో నీరు లేదని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును గోదావరి నీటిని వినియోగించుకునేందుకే నిర్మించారని, ఎత్తిపోసిన నీటిని నిల్వ చేసుకునేందుకు తగినంత నిల్వ సామర్థ్యం కూడా లేదని అన్నారు. మేడిగడ్డ దిగువన దేవాదుల, సీతారామ వంటి ప్రాజెక్టులు ఉన్నందున గోదావరి నీరు తెలంగాణలోని ప్రాజెక్టులకే వెళ్తుందని స్పష్టం చేశారు. నీళ్లు ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతున్నాయంటూ బీఆర్ఎస్‌ చేస్తున్న ప్రచారం వాస్తవ విరుద్ధమని అన్నారు. బొగ్గు, నీళ్లు, విద్యుత్‌ అంశాల్లో బీఆర్ఎస్‌కు చిత్తశుద్ధి లేకపోవడం వల్లే రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని చామల ఆరోపించారు. ఎల్‌నినో ప్రకృతి పరిణామమని, దాన్ని ఎవరూ సృష్టించలేరని పేర్కొన్నారు. సుమారు 150 ఏళ్ల తర్వాత ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని, దీనిపై కూడా రాజకీయాలు చేస్తూ బీఆర్ఎస్‌ విషప్రచారం చేస్తోందని విమర్శించారు.

28న ఎల్‌నినోపై అఖిలపక్ష భేటీ

ఎల్‌నినో, కరువు పరిస్థితులపై ఈనెల 28న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు చామల తెలిపారు. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పక్షాలు హాజరై రాష్ట్రాన్ని కరువు పరిస్థితుల నుంచి గట్టెక్కించేందుకు తగిన సూచనలు, సలహాలు అందించాలని ఆయన కోరారు.

Leave A Reply

Your email address will not be published.