అమిత్ షా పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి ఊరట
సుల్తాన్‌పూర్(ఉత్తర ప్రదేశ్), వెలుతురు, అక్టోబర్ 26 : కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కోర్టులో ఊరట లభించింది. 2018లో అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ప్రస్తుత కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ ఎంపీ–ఎమ్మెల్యే కోర్టు సోమవారం రాహుల్ గాంధీని నిర్దోషిగా ప్రకటించింది. అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ శుభం వర్మ తీర్పు వెలువరించారు. తీర్పు సమయంలో రాహుల్ గాంధీ స్వయంగా కోర్టులో హాజరయ్యారు.
2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో బెంగళూరులో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత విజయ్ మిశ్రా పరువు నష్టం కేసు దాఖలు చేశారు. అమిత్ షాను హత్య కేసులో నిందితుడిగా పేర్కొంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయని ఫిర్యాదుదారు ఆరోపించారు. ఈ కేసులో భారతీయ శిక్షాస్మృతిలోని 499, 500 సెక్షన్ల కింద విచారణ కొనసాగింది. అయితే రాహుల్ గాంధీ తరఫు న్యాయవాదులు తన వ్యాఖ్యలను సందర్భం నుంచి విడదీసి చూపించారని వాదించారు. విచారణ అనంతరం కోర్టు తాజాగా ఆయన వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించే విధంగా లేవని పేర్కొంటూ కేసు నుంచి నిర్దోషిగా ప్రకటించింది.
సుల్తాన్‌పూర్ వెళ్తుండగా కాన్వాయ్‌లో స్వల్ప ప్రమాదం
కోర్టు తీర్పు కోసం లక్నో నుంచి సుల్తాన్‌పూర్‌కు రాహుల్ గాంధీ వెళ్తుండగా పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఆయన కాన్వాయ్‌లోని కొన్ని వాహనాలు స్వల్పంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో రాహుల్ గాంధీ సురక్షితంగా ఉన్నారు. ఎలాంటి తీవ్ర గాయాలు సంభవించలేదని అధికారులు తెలిపారు.
