సీఎం వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి ధ్వజం
హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 09 : రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో రైతులు సాగునీరు, ప్రజలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎల్బీనగర్ ఎమ్మెల్యే డి.సుధీర్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని ఎత్తే అవకాశం ఉన్నా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కాళేశ్వరం తెలంగాణకు జీవనాడిగా నిలిచిందని, గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు, నీటిపారుదల పథకాల ప్రాధాన్యతను గుర్తించాలని అన్నారు. ముఖ్యమంత్రి తన వ్యాఖ్యల భాషను మార్చుకోవాలని హితవు పలికారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సాగునీరు, 24 గంటల విద్యుత్, మిషన్ భగీరథ వంటి పథకాలతో రాష్ట్రం అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రైతులకు నీరందించడంలో విఫలమైందని విమర్శించారు. కరువు మండలాలను ప్రకటించి రైతులకు ఆర్థిక సాయం అందించాలని, మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు చేపట్టి సాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు మోసపోయారని, ఇకపై వాస్తవాలను గుర్తించాలని పేర్కొన్నారు.
