ఏపీకి పొంచివున్న మరో ముప్పు
అమరావతి, వెలుతురు, నవంబర్ 01: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడి తుపానుగా మారింది. దీనికి ‘మురసు’ అని నామకరణం చేయడం తెలిసిందే. ప్రస్తుతం ఇది ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వేగంగా దూసుకొస్తుండటంతో, దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాలకు వాతావరణ శాఖ తుపాను హెచ్చరికలు జారీ చేసింది. ఈ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు, పెను గాలులు సంభవించే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.
ఆదివారం ఉదయం 11:30 గంటల సమయానికి ఈ తుపాను నైరుతి, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 560 కిలోమీటర్లు, నెల్లూరుకు 630 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 640 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 660 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉన్నట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. గడిచిన ఆరు గంటల్లో గంటకు 23 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తోంది.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, ‘మురసు’ తుపాను రానున్న 24 గంటల్లో మరింత బలపడి నవంబర్ 2వ తేదీ ఉదయం నాటికి తీవ్ర తుపానుగా మారనుంది. అనంతరం వాయవ్య దిశగా కదులుతూ నవంబర్ 2వ తేదీ రాత్రి 11.30 గంటల నుంచి తెల్లవారుజాము 4:00 గంటల మధ్య దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉంది. నెల్లూరు, నర్సాపురం మధ్యలో ఇది తీరం దాటవచ్చని అంచనా వేస్తున్నారు.
