- పాలన అంటే ప్రజల సమస్యల పరిష్కారమని వ్యాఖ్య
- ప్రతి నిర్ణయంలో పేదల సంక్షేమానికే ప్రాధాన్యం
- రైతులు, విద్యార్థులు, మహిళలపై ప్రత్యేక దృష్టి
- ప్రజల అవసరాలకే అనుగుణంగా నిర్ణయాలన్నారు
- సన్నబియ్యం పంపిణీ వెనుక మానవీయ ఆలోచన
- కోటి 15 లక్షల కుటుంబాలకు నాణ్యమైన బియ్యం లక్ష్యం
- పేదలకు కూడా మెరుగైన జీవన ప్రమాణాలే ధ్యేయం
- ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడే రేవంత్ అన్నారు
- సీఎం పనితీరుపై ప్రశంసలు కురిపించిన ఉప ముఖ్యమంత్రి
హైదరాబాద్ వెలుతురు జూలై 05:
పాలన అంటే కేవలం అధికారులతో సమావేశాలు నిర్వహించి వారు సిద్ధం చేసిన ఫైళ్లపై సంతకాలు చేయడం కాదని, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే అసలైన పాలన అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కలిసి పనిచేస్తున్న అనుభవంతో ఆయన పాలనపై తన అభిప్రాయాలను వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి కీలక నిర్ణయం, బడ్జెట్ రూపకల్పన, కేబినెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజల సంక్షేమానికే అధిక ప్రాధాన్యం ఇస్తారని భట్టి తెలిపారు. అధికారులు సూచించిన అంశాలను యథాతథంగా ఆమోదించడం కాకుండా, ప్రజల అవసరాలు ఏమిటో తెలుసుకుని వాటికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని సీఎం భావిస్తారని చెప్పారు.
తాము వచ్చిన నేల, రైతుల కష్టాలు, భూమిలేని పేదల బాధలు, ఆకలితో పాఠశాలకు వెళ్లే పిల్లల పరిస్థితి తెలుసు కాబట్టే ప్రజలు తమకు అధికారం ఇచ్చారని ముఖ్యమంత్రి తరచూ చెబుతుంటారని భట్టి పేర్కొన్నారు. అందుకే ప్రతి నిర్ణయంలో రైతు, పేదవాడు, విద్యార్థి, మహిళ, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ఉంటుందని వివరించారు.
పాలమూరు జిల్లా బిడ్డగా ఆకలి విలువ తెలిసిన వ్యక్తిగా రాష్ట్రంలో ఏ కుటుంబమూ నాసిరకం బియ్యం తినకూడదన్న ఆలోచనతోనే కోటి 15 లక్షల కుటుంబాలకు సన్నబియ్యం అందించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని భట్టి తెలిపారు. మంచి బియ్యం ధనవంతులకే పరిమితం కాకుండా పేదల ఇళ్లలో కూడా ఉండాలని, మధ్యతరగతి కుటుంబాలు గౌరవంగా జీవించే పరిస్థితులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచే నిర్ణయాలు ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడికే సాధ్యమవుతాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని భట్టి విక్రమార్క ప్రశంసించారు.
