హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-2 వేగం పెంచండి

  •  మెట్రో ఫేజ్‌-1 స్వాధీనం వేగవంతం చేయాలని డిమాండ్
  • ఎస్‌బీఐ క్యాప్స్‌ నియామకంలో జాప్యంపై ఆందోళన
  • టీఓఆర్‌ ఖరారులో ఆలస్యం సరికాదన్న సీఎం
  • జాప్యంతో ఫేజ్‌-1 నిర్వహణకు ఇబ్బందులు
  • ఫేజ్‌-2 డీపీఆర్‌ల ఆమోదం ఆలస్యమవుతోందని వ్యాఖ్య
  • ప్రాజెక్టు వ్యయం పెరిగే ప్రమాదముందని హెచ్చరిక
  • వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి
  • మెట్రో విస్తరణ పనులు వేగంగా పూర్తి చేయాలని విజ్ఞప్తి
  • కేంద్ర మంత్రులు ఖట్టర్‌, కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్‌ రెడ్డి లేఖలు

హైదరాబాద్ వెలుతురు జూలై 05:

హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఫేజ్‌-2 విస్తరణకు కేంద్ర అనుమతులు త్వరగా మంజూరు చేయడంతో పాటు, మెట్రో ఫేజ్‌-1ను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి విడివిడిగా లేఖలు రాశారు.

ఇటీవల జూన్‌ 23, 24 తేదీల్లో కేంద్ర మంత్రులతో జరిగిన సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి లేఖల్లో గుర్తు చేశారు. మెట్రో ఫేజ్‌-1 ఆస్తుల విలువ నిర్ధారణ, అధిక వడ్డీ రుణాల పునర్వ్యవస్థీకరణ, ఫేజ్‌-2కు అవసరమైన నిధుల సమీకరణపై అధ్యయనం చేసేందుకు కేంద్ర నోడల్‌ ఏజెన్సీ ఎస్‌బీఐ క్యాప్స్‌ను నియమించాలని అప్పుడే నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

అయితే ఇప్పటివరకు టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌ (టీఓఆర్‌) ఖరారు చేయకపోవడంతో పాటు ఎస్‌బీఐ క్యాప్స్‌కు అధికారికంగా బాధ్యతలు అప్పగించడంలో జాప్యం జరుగుతోందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల మెట్రో ఫేజ్‌-1 నిర్వహణలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, ఫేజ్‌-2 డీపీఆర్‌ల ఆమోదం, నిధుల సమీకరణ కూడా ఆలస్యమవుతోందని తెలిపారు. ఈ జాప్యం కొనసాగితే ప్రాజెక్టు వ్యయం పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.

హైదరాబాద్‌ భవిష్యత్‌ రవాణా అవసరాల దృష్ట్యా మెట్రో ఫేజ్‌-2 విస్తరణ కీలకమని పేర్కొన్న ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని ఎస్‌బీఐ క్యాప్స్‌ నియామక ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో మెట్రో ఫేజ్‌-1 స్వాధీనం ప్రక్రియ పూర్తై, ఫేజ్‌-2 విస్తరణ పనులు ఎలాంటి జాప్యం లేకుండా ముందుకు సాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.