- ప్రభుత్వం స్పందించకపోతే 60 వేల మందితో ముట్టడిస్తాం
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేటీఆర్
- కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి లక్ష క్యూసెక్కుల నీరు వృథాగా కిందికి పోతోందని ఆరోపణ
- కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా నీరు అందించొచ్చని వ్యాఖ్య
- కేసీఆర్‌కు వారం రోజులు ప్రాజెక్టు అప్పగిస్తే తెలంగాణ మొత్తానికి నీరందిస్తారని వెల్లడి
- రైతులు కన్నెపల్లికి వచ్చి పరిస్థితి చూసి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని పిలుపు
- స్పందించకపోతే 60 వేల మందితో పంప్‌హౌస్‌ను ముట్టడించి పంపులు ఆన్ చేస్తామని హెచ్చరిక
కన్నెపల్లి వెలుతురు జూలై 05:
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి లక్ష క్యూసెక్కుల నీరు వృథాగా కిందికి పోతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. బీడు భూములకు నీరు అందించాలనే ఆలోచనతోనే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ ప్రాజెక్టును నిర్మించామని పేర్కొన్నారు.
కన్నెపల్లి పంప్‌హౌస్‌ను కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్ బృందం సందర్శించింది. అంతకుముందు పలుచోట్ల కేటీఆర్ కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకోవడంతో బీఆర్‌ఎస్ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
పంప్‌హౌస్‌ను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్, ఎన్నో అడ్డంకులు దాటుకుని కన్నెపల్లికి వచ్చామని, రాజకీయ విమర్శల కోసం తాము రాలేదని అన్నారు. కేసీఆర్ నాలుగేళ్లలో 141 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశారని తెలిపారు.
ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలు మినహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు కాళేశ్వరం ద్వారా నీరు అందించవచ్చని కేటీఆర్ చెప్పారు. వర్షాలు లేకపోయినా కన్నెపల్లి వద్ద నీరు అందుబాటులో ఉంటుందని, కేసీఆర్‌కు వారం రోజులు కాళేశ్వరం ప్రాజెక్టు అప్పగిస్తే తెలంగాణ మొత్తం నీటి సమస్యను పరిష్కరిస్తారని వ్యాఖ్యానించారు.
రైతులు కన్నెపల్లికి వచ్చి పరిస్థితిని స్వయంగా పరిశీలించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ఆయన పిలుపునిచ్చారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేదా అని ప్రశ్నించారు. సాగునీటితో పాటు హైదరాబాద్‌కు తాగునీటి సమస్య కూడా నెలకొంటోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వంపై అందరూ కలిసి ఒత్తిడి తీసుకురావాలని, అయినా స్పందించకపోతే 60 వేల మంది రైతులతో కలిసి కన్నెపల్లి పంప్‌హౌస్‌ను ముట్టడించి పంపులను ఆన్ చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. రైతుల కంటే ప్రభుత్వానికి మరే అంశం ముఖ్యమై ఉండకూడదని ఆయన అన్నారు.
కేటీఆర్ వ్యాఖ్యలకు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఘాటు కౌంటర్
కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకుని, నాణ్యతలేని నిర్మాణాలతో తెలంగాణ ప్రజలపై భారాన్ని మోపిన బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు లేదని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా విమర్శించారు. కన్నెపల్లి పర్యటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నమేనని మంత్రి అన్నారు.
“పేదలకు ఇళ్లు కడితే కమీషన్లు రావు… కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టులు కడితేనే కమీషన్లు వస్తాయనే ఆలోచనతో బీఆర్ఎస్ పాలకులు పేదల గృహాల అవసరాన్ని విస్మరించారు. అందుకే నేడు తెలంగాణ ప్రజలు వారిని అధికారానికి దూరం చేశారు” అని మంత్రి వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టును నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా, కమీషన్ల కోసమే నిర్మించడం వల్లే నేడు మరమ్మతుల అవసరం వచ్చిందని మంత్రి స్పష్టం చేశారు. “అసలు రిపేరు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీ అవినీతి, మీ కక్కుర్తే దానికి కారణం కాదా? మీరు నాసిరకం నిర్మాణాలు చేసి కూల్చేసి… ఇప్పుడు వాటిని ప్రభుత్వం బాగు చేయలేదని విమర్శించడం హాస్యాస్పదం” అని మండిపడ్డారు.
కన్నెపల్లిలోకి వెళ్లి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్న బీఆర్ఎస్ నాయకుల నాటకాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, వాస్తవాలను దాచిపెట్టి అబద్ధాలతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న వారి ప్రయత్నాలు ఇక ఫలించవని అన్నారు. తెలంగాణ ప్రజల రక్తాన్ని, చెమటను దోచుకుని వేల కోట్ల అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్‌కు పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం, రైతు సంక్షేమం, మహిళల సాధికారత, ఉపాధి కల్పన వంటి సంక్షేమ కార్యక్రమాలను పారదర్శకంగా అమలు చేస్తోందని, కమీషన్ల కోసం కాదు.. ప్రజల కోసం పాలన సాగిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
