- వ్యవసాయంలో సాంకేతిక విప్లవానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం
- ఫర్టిలైజర్ యాప్‌కు రైతుల నుంచి అనూహ్య స్పందన
- యాప్‌తో యూరియా పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట వేస్తామన్న మంత్రి
- రాష్ట్రంలో 3.39 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నట్లు వెల్లడి
- ఇప్పటి వరకు 2.52 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా విక్రయాలు జరిగినట్లు వివరాలు
- 17.70 లక్షల మంది రైతులు యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేసినట్లు ప్రకటన
- 59.78 లక్షల యూరియా బ్యాగులు బుక్.. 52.86 లక్షల బ్యాగుల కొనుగోలు పూర్తి
- భూమి ఆధారిత పంపిణీతో నిజమైన రైతులకే ఎరువులు అందజేస్తామని స్పష్టం
- ఏఐ, శాటిలైట్ ఆధారిత సాంకేతికతను వ్యవసాయంలో వినియోగించనున్న ప్రభుత్వం
- రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి తుమ్మల పునరుద్ఘాటన
హైదరాబాద్ వెలుతురు జూలై 05:
వ్యవసాయంలో సాంకేతిక విప్లవానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఫర్టిలైజర్ యాప్‌కు రైతుల నుంచి అనూహ్య స్పందన లభించిందన్నారు. ఈ యాప్ ద్వారా యూరియా పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిరోజూ జిల్లాల వారీగా యూరియా బులెటిన్లు విడుదల చేస్తామని వెల్లడించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 3.39 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు 2.52 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా విక్రయాలు జరిగాయని చెప్పారు. 17.70 లక్షల మంది రైతులు ఫర్టిలైజర్ యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేసుకున్నారని, మొత్తం 59.78 లక్షల యూరియా బ్యాగులు బుక్ కాగా అందులో 52.86 లక్షల బ్యాగుల కొనుగోలు పూర్తయిందని వివరించారు.
భూమి ఆధారిత యూరియా పంపిణీ విధానం ద్వారా నిజమైన రైతులకే ఎరువులు అందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి స్పష్టం చేశారు. బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టిందని, నిఘాను కూడా మరింత పెంచినట్లు వెల్లడించారు.
శాటిలైట్ ఆధారిత మట్టి పరీక్షలపై ప్రయోగాలు కొనసాగుతున్నాయని, వ్యవసాయంలో కృత్రిమ మేధ , ఉపగ్రహ సాంకేతికత వినియోగానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వ్యవసాయ సాంకేతికతపై జర్మనీలో అంతర్జాతీయ సంస్థలతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పునరుద్ఘాటించారు.
