- ఎక్స్ షోరూం ధర రూ. 5.44 లక్షలు మాత్రమే
- బోల్డన్ని సేఫ్టీ ఫీచర్స్
- మూడు వేరియంట్లలో విడుదల చేసిన రెనాల్ట్
భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఇటీవల చిన్నకార్ల విక్రయాలు విపరీతంగా పెరిగాయి. మారుతి సుజుకి ఆల్టోకు పోటీగా రెనాల్ట్ అత్యంత చవకైన ఆటోమెటిక్ కారును లాంచ్ చేసింది. వచ్చే మూడేళ్లలో ఐదు ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని భావిస్తున్న రెనాల్ట్.. క్విడ్ ఆర్ఎక్స్ఎల్(ఓ) ఈజీ-ఆర్ ఏఎంటీ వేరియంట్‌ను తాజాగా విడుదల చేసింది. దేశంలో ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న చవక కార్లలో అత్యంత సరసమైనది ఇదే. దీని ఎక్స్ షోరూం ధర రూ. 5.44 లక్షలు మాత్రమే. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి ఆల్టో కే10 ఆటోమెటిక్ వేరియంట్ ఎక్స్ షోరూం ధర రూ. 5.61 లక్షలు. రెనాల్ట్ క్విడ్ 999 సీసీ, మూడు సిలిండర్లు ఉన్నాయి. దీని పెట్రోల్ ఇంజిన్ 68 బీహెచ్‌పీ, 91 ఎన్ఎం గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
2024 రెనాల్ట్ క్విడ్ శ్రేణిని మూడు కొత్త డ్యూయల్ టోన్ ఎక్స్‌టీరియర్ బాడీ కలర్‌తో తీసుకొచ్చింది. వినియోగదారులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించే క్రమంలో 8 అంగుళాల టచ్ స్క్రీన్ మీడియా ఎన్ఏహెవీ సిస్టంను చేర్చింది. ఫలితంగా ఇండస్ట్రీలో టచ్‌స్క్రీన్ మీడియా ఎన్ఏవీతో కూడిన అత్యంత చవకైన కారుగా ఇది రికార్డులకెక్కింది. ఆటోమెటిక్ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని రెనాల్ట్ ఈ హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసింది. ప్రయాణికులకు ఇందులో మరింత మెరుగైన రక్షణ సౌకర్యాలు ఉన్నాయి. ఇందులోని అన్ని వేరియంట్లలోనూ సీట్‌బెల్ట్ రిమైండర్ ఉంది. 14 సేఫ్టీ ప్రమాణాలను ఏర్పాటు చేశారు.