కంఠంలో ప్రాణం ఉండగా బీఆర్‌ఎస్‌లోకి వెళ్లేది లేదు: కవిత

  • కాళేశ్వరం అవినీతికి హరీశ్ రావే కారణం
  • టీఆర్ఎస్ చీఫ్ క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
  • బీఆర్ఎస్‌ పార్టీకి కవిత బహిరంగ సవాల్
  • దమ్ముంటే ప్రజా సమస్యలపై పోటీ పడండి
  • ప్రాణమున్నంత వరకు బీఆర్ఎస్‌తో జతకట్టేదే లేదు
  • ఆ పార్టీతో ప్రజా క్షేత్రంలో పోరాడేందుకు సిద్ధం
  • చాటుమాటు రాజకీయం వీడాలన్న కల్వకుంట్ల కవిత
  • మీడియా కవరేజీని అడ్డుకుంటున్న కేటీఆర్, హరీశ్ రావు
  • ఒక ఆడబిడ్డను చూసి ఎందుకింత భయమంటూ ప్రశ్నల వర్షం

దరాబాద్ వెలుతురు జూలై 09:

తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ప్రజల పక్షాన నిలబడి పోరాడటంలో బీఆర్ఎస్ పార్టీకి నిజంగా దమ్ముంటే తనతో పోటీ పడాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బహిరంగ సవాల్ విసిరారు. గురువారం నాడు ఆమె హైదరాబాద్‌లో మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. తాను కొత్తగా రాజకీయ పార్టీ పెట్టుకున్న తరుణంలో.. మాకేం భయం లేదని పైకి గంభీరంగా ప్రగల్భాలు పలికిన బీఆర్ఎస్ నాయకులు, ఇప్పుడు ఎందుకు లోపల భయపడుతూ చాటుమాటుగా కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీ) తమపై ఫిర్యాదులు చేస్తున్నారని నిలదీశారు.

తమ తెలంగాణ రక్షణ సేన పార్టీకి సంబంధించిన రాజకీయ వార్తలను, కార్యక్రమాలను కవర్ చేస్తున్న ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానళ్ల యాజమాన్యాలకు బీఆర్ఎస్ అగ్ర నాయకులు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్), తన్నీరు హరీశ్ రావు స్వయంగా ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. తమ వార్తలు రాకుండా అడ్డుకుంటున్నారని, ఇంత సిగ్గులేని వ్యవహారాలకు ఎందుకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. ఒక ఆడబిడ్డగా తాను ధైర్యంగా ప్రజల మధ్యకు వెళ్తుంటే.. తట్టుకోలేక ఆంబోతుల్లా, అడ్డగాడిదల్లా తన కాళ్లల్లో కట్టెలు పెట్టే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏనాటికైనా తాను మళ్లీ బీఆర్ఎస్ పార్టీలోకి వస్తానంటూ ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారని, కానీ తన కంఠంలో ప్రాణమున్నంత వరకు మళ్లీ బీఆర్ఎస్‌లో కలిసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

తమ నూతన పార్టీకి ‘తెలంగాణ రక్షణ సేన’ అనే పేరును తాము సొంతంగా పెట్టుకోలేదని, కేంద్ర ఎన్నికల సంఘం తమకు పంపిన ఐదు పేర్ల జాబితా నుండి మాత్రమే దీనిని ఎంపిక చేసుకున్నామని కవిత స్పష్టం చేశారు. అయితే ఈ పేరును కూడా తమకు దక్కకుండా చేసేందుకు బీఆర్ఎస్ నాయకత్వం అన్ని రకాలుగా కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. కానీ దేవుడు, ధర్మం, న్యాయం తన పక్షాన ఉన్నాయని, అంతిమంగా ఈ పోరాటంలో విజయం తనదే అవుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. పార్టీ పేరు ఏదైనా సరే, చివరకు ప్రజల ఆశీర్వాదం ఉంటేనే ఏ పార్టీ అయినా మనుగడ సాగిస్తుందని గుర్తుచేశారు. తాను గతంలో కేటీఆర్, హరీశ్ రావులపై చేసిన రాజకీయ విమర్శలకు సమాధానం చెప్పలేకనే ఇలాంటి చిల్లర పనులు చేస్తున్నారని విమర్శించారు.

బీఆర్ఎస్ పార్టీకి చెందిన అధికారిక సోషల్ మీడియా విభాగంపై కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కనీసం ఒక మహిళ అని చూడకుండా, తల్లీ, చెల్లి అనే కనీస సంస్కారం, మర్యాద లేకుండా సోషల్ మీడియాలో అడ్డగోలుగా, అసభ్యకరంగా కామెంట్లు పెడితే చూస్తూ ఊరుకునేది లేదని తీవ్రంగా హెచ్చరించారు. దమ్ముంటే తెర వెనుక దాక్కోకుండా ముఖం చూపించి నేరుగా మాట్లాడాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా అకౌంట్ల వెనుక ఉండి నడిపిస్తున్నది ఎవరో తమకు పూర్తిగా తెలుసని, పరిమితులు దాటి అతిగా ప్రవర్తిస్తే కాళ్లు విరగ్గొడతామని కఠినమైన భాషలో వార్నింగ్ ఇచ్చారు.

రాజకీయంగా తమకు అనుకూల ప్రచారం చేసుకోవడం కోసం, తమ తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవలే సుమారు రూ.188 కోట్ల భారీ వ్యయంతో ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రికను కొనుగోలు చేశారని కవిత సంచలన ఆరోపణ చేశారు. మీడియా సంస్థలను కొనుగోలు చేసినంత మాత్రాన నిజాలు నమ్మకుండా పోవన్నారు. ప్రజలు మెచ్చితే రేపు తాము అధికారంలోకి వస్తామని, ఒకవేళ ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా అధికారం లేదనే నెపంతో తాము ఇంట్లో పడుకోబోమని, నిరంతరం జనం మధ్యే ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతామని స్పష్టం చేశారు.

తెలంగాణ రక్షించేందుకు జోడెద్దుల్లా పనిచేయాల్సిన కేటీఆర్, హరీశ్ రావులు దున్నపోతుల్లా మారి ప్రజల సమస్యలను పూర్తిగా గాలికొదిలేశారని కవిత ఘాటుగా విమర్శించారు. కేవలం అవినీతిపరులను కాపాడటమే వారు నిత్యకృత్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. తాను మొన్న ఉద్యమకారుల హక్కుల కోసం పోరాటం చేస్తే, తనను అడ్డుకోవడానికి అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ పార్టీలు కలిసి ఒక ఉమ్మడి నాటకానికి తెరలేపాయని విమర్శించారు. అవసరాన్ని బట్టి కాంగ్రెస్‌తో, వీలైతే బీజేపీతో జతకట్టే బీఆర్ఎస్‌కు అసలు ఒక రాజకీయ విధానం అంటూ ఉందా అని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన భారీ అవినీతికి హరీశ్ రావే పూర్తి బాధ్యుడని, కేసీఆర్‌కు అవినీతి మరకలు అంటించింది చాలదన్నట్లు ఇప్పుడు మళ్లీ మరో మూడు నెలలు ఇరిగేషన్ మంత్రి పదవి అడుగుతున్నావా అని ప్రశ్నించారు. ఏనాడైతే అవినీతికి కారణమైన గుంటనక్కలను ముందు పెట్టారో, నాడే బీఆర్ఎస్ పతనం మొదలైందని, ఆ పార్టీ ఈ జన్మలో బాగుపడదని జోస్యం చెప్పారు.

తెలంగాణ ప్రజల ఆస్తి అయిన దాదాపు రూ.800 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ‘ఫీనిక్స్’ అనే ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థకు కేటీఆర్, హరీశ్ రావు కలిసి దారాదత్తం చేశారని కవిత ఆరోపించారు. అసలు ఎవడా ఫీనిక్స్ గాడు? వాడు తెలంగాణ వాడా.. ఆంధ్ర వాడా? అని ప్రశ్నించిన ఆమె, ఎందుకంత ప్రేమతో తెలంగాణ విలువైన భూములను అతనికి రాసిచ్చారని నిలదీశారు. జాతీయ పార్టీలకు తెలంగాణ భూములను కాపాడాలనే ఆలోచన ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న సుమారు 33 లక్షల టన్నుల విలువైన కలపను సదరు ఫీనిక్స్ సంస్థ అక్రమంగా కొట్టేస్తే, గత ప్రభుత్వం కేవలం 10 చిన్న కేసులు పెట్టి ఊరుకుందని విమర్శించారు. తాము భవిష్యత్తులో అధికారంలోకి వచ్చాక కేసీఆర్, ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన ధార్మిక, ప్రభుత్వ భూములన్నింటిపై సమగ్ర రివ్యూ జరిపి, ప్రజా ధనాన్ని కక్కిస్తామని స్పష్టం చేశారు.

తమ పార్టీ భవిష్యత్ కార్యాచరణలో భాగంగా ‘సింగరేణి బాయి బాట’ కార్యక్రమాన్ని చేపట్టి కార్మికులతో స్వయంగా మమేకమవుతున్నట్లు కవిత ప్రకటించారు. సింగరేణిలోని పర్మినెంట్ మరియు కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొంటున్న అనేక తీవ్రమైన సమస్యలపై యాజమాన్యం తక్షణమే స్పందించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ హక్కుగా ఉన్న బొగ్గు బ్లాకులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన మొండి వైఖరితో ప్రైవేట్ పరం చేస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం కలిసి కార్మికుల డిపెండెంట్ ఉద్యోగాలపై త్వరలోనే స్పష్టమైన ప్రకటన చేయకపోతే, ఈ నెల 20వ తేదీ నుండి రామగుండం కేంద్రంగా తాను నిరవధిక నిరాహార దీక్షకు దిగడం ఖాయమని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.