- పరిశ్రమలు ఓఆర్ఆర్ బయటకు తరలింపు
- ప్రిమియర్ ఎనర్జీస్ యూనిట్ ప్రారంభించిన సీఎం
- 5.6 గిగావాట్ల సోలార్ ప్లాంట్ ప్రారంభం
- మూసీ, పరిశ్రమల కాలుష్యంపై ఆందోళన
- ఢిల్లీ, బెంగళూరు నుంచి పాఠాలు
- తెలంగాణ రైజింగ్-2047 విజన్ ప్రకటించిన సీఎం
- 2034 నాటికి ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం
- యువతకు నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
- ప్రజల సహకారంతో కాలుష్య నియంత్రణ
- రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్‌లో సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్ ప్రారంభం
హైదరాబాద్ వెలుతురు జూలై 09:
హైదరాబాద్‌ను దేశంలోనే అత్యంత ప్రణాళికాబద్ధమైన, కాలుష్యరహిత మహానగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లోపల విస్తరించి ఉన్న 2,100 చదరపు కిలోమీటర్ల కోర్ అర్బన్ ప్రాంతాన్ని పూర్తిగా కాలుష్య రహితంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు. ఇందుకోసం నగరంలోని పరిశ్రమలను దశలవారీగా ఓఆర్ఆర్ వెలుపల ఏర్పాటు చేసిన ప్రత్యేక మాన్యుఫాక్చరింగ్ జోన్‌కు తరలిస్తున్నట్లు వెల్లడించారు.
రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్‌లో ప్రముఖ సోలార్ సంస్థ ప్రీమియర్ ఎనర్జీస్ ఏర్పాటు చేసిన 5.6 గిగావాట్ల సామర్థ్యం గల సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్‌ను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలను వివరించారు.
హైదరాబాద్ కోర్ అర్బన్ ప్రాంతంలో ప్రస్తుతం సుమారు 1.35 కోట్ల మంది నివసిస్తున్నారని, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నగరాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించి, అలాంటి పరిస్థితులు హైదరాబాద్‌కు రాకుండా ఇప్పుడే ముందస్తు చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
జీడిమెట్ల, బాలానగర్ వంటి పారిశ్రామిక ప్రాంతాల నుంచి వెలువడుతున్న కాలుష్యం, మూసీ నది కాలుష్యం నగర ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఓఆర్ఆర్ లోపల ప్రాంతాన్ని పూర్తిగా కాలుష్యరహితంగా మార్చే కార్యాచరణను ప్రభుత్వం రూపొందించిందని తెలిపారు.
పరిశ్రమలను ఓఆర్ఆర్ వెలుపలికి తరలించేందుకు ఇప్పటికే చట్టం తీసుకొచ్చామని, పెరి అర్బన్ ఎకానమీ ప్రాంతాన్ని ప్రత్యేక మాన్యుఫాక్చరింగ్ జోన్‌గా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. నగరం నుంచి తరలించే పరిశ్రమలకు అవసరమైన భూమి, మౌలిక సదుపాయాలను ప్రభుత్వం అందిస్తుందని స్పష్టం చేశారు.
ఈ మాన్యుఫాక్చరింగ్ జోన్‌లో తొలి పరిశ్రమగా ప్రీమియర్ ఎనర్జీస్ యూనిట్ ప్రారంభం కావడం శుభపరిణామమని సీఎం అన్నారు. కేవలం 12 నెలల్లోనే అత్యాధునిక సోలార్ తయారీ యూనిట్‌ను నిర్మించడం సంస్థ సామర్థ్యానికి నిదర్శనమని కొనియాడారు.
ఈ సందర్భంగా ప్రీమియర్ ఎనర్జీస్ రూపొందించిన సోలార్ ఆధారిత ‘ఆక్సీ ట్రీ’ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. సోలార్ విద్యుత్‌తో పనిచేసే ఈ వ్యవస్థ వీధి దీపాలతో పాటు గాలిని శుద్ధి చేసే సాంకేతికతను కలిగి ఉందని తెలిపారు. సంస్థ తయారు చేస్తున్న సోలార్ మాడ్యూల్స్‌తో పాటు ఇతర ఉత్పత్తులను కూడా ఆయన పరిశీలించారు.
తెలంగాణ రైజింగ్–2047 విజన్‌తో రాష్ట్రాన్ని క్యూర్ (CURE), ప్యూర్ (PURE), రేర్ (RARE) అనే మూడు ప్రాంతీయ అభివృద్ధి మండళ్లుగా విభజించి సమగ్ర అభివృద్ధి చేపడుతున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని సీఎం తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన బ్లూ కాలర్ ఉద్యోగాలకు యువతను సిద్ధం చేసేందుకు అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్లు, పాలిటెక్నిక్ కళాశాలల బలోపేతం, స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు.
హైదరాబాద్ ప్రపంచస్థాయి నగరంగా ఎదగాలంటే మరిన్ని పెట్టుబడులు, పరిశ్రమలు అవసరమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రకృతిని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, కాలుష్య నియంత్రణలో ప్రభుత్వంతో పాటు ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య, ప్రీమియర్ ఎనర్జీస్ చైర్మన్ సురేందర్ పాల్ సింగ్ సలూజా, మేనేజింగ్ డైరెక్టర్ చిరంజీవ్ సింగ్ సలూజా, డైరెక్టర్ సుధీర్ మూల, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రేవతి రోహిణి, ప్రభుత్వ ఉన్నతాధికారులు, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
