షిండేతో శరద్ పవార్ రహస్య భేటీ

  • మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలా?
  •  15 నిమిషాల పాటు ఏకాంతంగా చర్చించిన ఇద్దరు నేతలు
  • అసెంబ్లీ సమావేశం తర్వాత జరిగిన భేటీ
  • ఏ అంశంపై చర్చించారో వెల్లడి చేయని నేతలు
  • ఎన్‌డీఏలో చేరతారనే ప్రచారానికి ఊతం
  • ఎంవీఏలో కలకలం రేపిన పవార్ చర్య
  • మర్యాదపూర్వక భేటీ మాత్రమేనన్న షిండే కార్యాలయం
  • శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ తీవ్ర విమర్శలు
  • ప్రజల్లో గందరగోళం సృష్టించే చర్య అని వ్యాఖ్య
  • ఇటీవలే షిండే వర్గంలో చేరిన యూబీటీ ఎంపీలు
  • మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెర

మహారాష్ట్ర వెలుతురు జూలై 09:

మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి కొత్త సమీకరణాలపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్, ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతో ప్రత్యేకంగా భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దాదాపు 15 నిమిషాల పాటు ఇద్దరు నేతలు ఏకాంతంగా మాట్లాడటం, ఆ చర్చ వివరాలను వెల్లడించకపోవడంతో పవార్ ఎన్‌డీఏ కూటమిలో చేరనున్నారనే ప్రచారం ఊపందుకుంది.

మహారాష్ట్ర–కర్ణాటక సరిహద్దు వివాదంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ అధ్యక్షతన అసెంబ్లీలో నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి శరద్ పవార్ హాజరయ్యారు. సమావేశం అనంతరం రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరుగుతుండగా, ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే మధ్యలోనే బయటకు వచ్చి అసెంబ్లీ ఆవరణలోని తన కార్యాలయం వద్ద వేచి ఉన్న శరద్ పవార్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఈ భేటీలో ఏ అంశాలపై చర్చ జరిగిందన్న విషయాన్ని ఇద్దరు నేతలు వెల్లడించలేదు. అయితే ఇది మర్యాదపూర్వక సమావేశం మాత్రమేనని శిందే కార్యాలయం స్పష్టం చేసింది. అయినప్పటికీ, పవార్ తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఎన్డీయే కూటమిలో చేరవచ్చన్న రాజకీయ ఊహాగానాలకు ఈ సమావేశం మరింత బలం చేకూర్చింది.

ఇటీవల మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)లో భాగమైన శివసేన (యూబీటీ)కి చెందిన ఆరుగురు ఎంపీలు శిందే వర్గంలో చేరడం ప్రతిపక్ష కూటమిలో కలకలం రేపింది. ఈ నేపథ్యంలో శిందే–పవార్ భేటీ జరగడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.

శరద్ పవార్ తీరుపై శివసేన (యూబీటీ) సీనియర్ నేత సంజయ్ రౌత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏక్‌నాథ్ శిందేతో ప్రత్యేకంగా సమావేశం కావాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించిన ఆయన, ఇటువంటి చర్యలతో మహా వికాస్ అఘాడీ కూటమిపై ప్రజల్లో విశ్వసనీయత దెబ్బతింటుందని వ్యాఖ్యానించారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో రానున్న రోజుల్లో మరిన్ని పరిణామాలు చోటుచేసుకునే అవకాశంపై చర్చ కొనసాగుతోంది.

Leave A Reply

Your email address will not be published.