హింసను ప్రేరేపించేలా రేవంత్‌ వ్యాఖ్యలు: మాజీ మంత్రి హరీశ్ రావు

  • హింసను ప్రేరేపించేలా రేవంత్‌ వ్యాఖ్యలు
  • సీఎం వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం
  • హిట్లర్‌ తనకు ఆదర్శమని గతంలో రేవంత్‌ చెప్పారని విమర్శ
  • ప్రజా సమస్యలపై సమాధానం చెప్పలేక వ్యక్తిగత వ్యాఖ్యలంటూ ఆరోపణ
  • నిన్న చేసిన వ్యాఖ్యలపై సీఎం బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌
  • షాబాద్‌ ఘటనపై తెలంగాణ సీఎం స్పందించకపోవడం బాధాకరమని వ్యాఖ్య
  • కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎంకు ఇప్పటికీ సరైన అవగాహన లేదని విమర్శ
  • మేడిగడ్డ వద్ద నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపణ
  • రైతులకు సాగునీరు అందించకుండా ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆగ్రహం
  • ఎల్లంపల్లి నీటి విషయంలో రాజకీయాలు చేస్తే రాష్ట్రానికి నష్టం తప్పదని హెచ్చరిక
  • మేడిగడ్డపై సీఎం చేస్తున్న వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధమని స్పష్టీకరణ

హైదరాబాద్ వెలుతురు జూలై 12:

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని  బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి సంయమనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని, కానీ రేవంత్‌రెడ్డి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. గతంలో హిట్లర్‌ తనకు ఆదర్శమని రేవంత్‌రెడ్డి స్వయంగా చెప్పారని, ఇప్పుడు కూడా అదే తరహా భాషను ఉపయోగిస్తూ రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు.

తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అంశాలపై మాట్లాడకుండా వ్యక్తిగత విమర్శలు, అనుచిత వ్యాఖ్యలతో సీఎం దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. నిన్న చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంటూ, వాటిపై రేవంత్‌రెడ్డి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

షాబాద్‌లో జరిగిన ఘటనపై పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించినప్పటికీ తెలంగాణ ముఖ్యమంత్రి ఇప్పటివరకు స్పందించకపోవడం విచారకరమని హరీశ్‌రావు అన్నారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల అంశాల్లో ప్రభుత్వం మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చేస్తున్న వ్యాఖ్యలపైనా హరీశ్‌రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 31 నెలలు పూర్తయినా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, పనితీరు, సాంకేతిక అంశాలపై రేవంత్‌రెడ్డికి ఇప్పటికీ సరైన అవగాహన రాలేదని విమర్శించారు. విశ్రాంత ఇంజినీర్లు, నీటిపారుదల శాఖ అధికారులు మేడిగడ్డ వద్ద నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని చెబుతున్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

రైతులకు సాగునీరు అందించే దిశగా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం, ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని హరీశ్‌రావు ఆరోపించారు. వాస్తవాలు మాట్లాడిన వారిని జైలుకు పంపిస్తామని బెదిరించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ప్రజా సమస్యలను ప్రస్తావించిన వారిపై ఒత్తిడి తీసుకురావడం కంటే, వాటి పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు.

ఎల్లంపల్లి ప్రాజెక్టుపై హైదరాబాద్‌తో పాటు అనేక జిల్లాలు ఆధారపడి ఉన్నాయని హరీశ్‌రావు గుర్తు చేశారు. నీటి వంటి అత్యంత కీలకమైన అంశంలో రాజకీయాలు చేయడం వల్ల రాష్ట్ర ప్రయోజనాలకే నష్టం జరుగుతుందని హెచ్చరించారు. కరవు పరిస్థితులు మరింత జఠిలం కాకుండా ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.

కన్నెపల్లి పంప్‌హౌస్‌ను వెంటనే ప్రారంభించి రైతులకు అవసరమైన నీటిని అందించాలని డిమాండ్‌ చేసిన హరీశ్‌రావు, పంప్‌హౌస్‌ బటన్లు నొక్కడానికి బదులుగా ప్రభుత్వం ప్రతిపక్షాల కంఠం నొక్కడంపై దృష్టి పెట్టిందని విమర్శించారు. మేడిగడ్డ అంశంపై ముఖ్యమంత్రి చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవాలని, వాస్తవ పరిస్థితులను ప్రజలకు వెల్లడించకుండా రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.