- భారత విద్యా వ్యవస్థపై తీవ్రస్థాయిలో మండిపడ్డ లోక్‌సభ ప్రతిపక్ష నేత
- పేపర్ లీకులు, అవినీతిపై కేంద్ర ప్రభుత్వం మౌనం వహిస్తోందని ఆరోపణ
- విద్యార్థుల భవిష్యత్తుతో పేపర్ లీక్ మాఫియా ఆటలాడుతోందని వ్యాఖ్య
- విద్యార్థులు, వారి కుటుంబాలు అప్పులు, ఒత్తిడిలో కూరుకుపోతున్నాయని ఆవేదన
- నిజాయితీ లేని దోపిడీ యంత్రాంగంగా విద్యా వ్యవస్థ మారిందని విమర్శ
- ప్రధాని మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి జవాబుదారీతనం తప్పించుకుంటున్నారని ఆరోపణ
- విద్యా రంగంలోని సమస్యలపై మీడియా కూడా మౌనంగా ఉందని వ్యాఖ్య
- దేశ విద్యా రంగంలో సమూల మార్పులు అవసరమని రాహుల్ అభిప్రాయం
- ‘ఛాత్రోన్ కీ గూంజ్’ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొనాలని పిలుపు
- జులై 17న డెహ్రాడూన్‌లో నిర్వహించే కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానం
ఢిల్లీ వెలుతురు జూలై 13:
భారత విద్యా వ్యవస్థపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం దేశ విద్యా వ్యవస్థ నిజాయితీ లేని దోపిడీ యంత్రాంగంగా మారిందని ఆరోపించారు. వరుసగా జరుగుతున్న ప్రశ్నాపత్రాల లీకులు, విద్యా రంగంలో పెరుగుతున్న అవినీతిపై కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం, కేంద్ర విద్యాశాఖ మంత్రి మౌనం వహిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ఆయన పోస్టు చేశారు.
‘అవినీతి, అన్యాయం, పక్షపాతం, నిజాయితీ లేని వ్యవస్థ’ అనే పదాలు తనవి కావని, భారత విద్యా వ్యవస్థపై విద్యార్థులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలేనని రాహుల్ పేర్కొన్నారు. విద్యార్థులను భవిష్యత్తుకు సిద్ధం చేయాల్సిన వ్యవస్థ.. వారిని, వారి కుటుంబాలను అప్పులు, మానసిక ఒత్తిడి, నిరాశల వైపు నెడుతోందని విమర్శించారు.
దేశంలో కొనసాగుతున్న అవినీతే పేపర్ లీక్ మాఫియాకు కారణమైందని రాహుల్ ఆరోపించారు. పోటీ పరీక్షల కోసం ఏళ్ల తరబడి కష్టపడుతున్న లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ఈ మాఫియా ఒక్కసారిగా నాశనం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం, కేంద్ర విద్యాశాఖ మంత్రి ఈ అంశంపై స్పందించకుండా మౌనం పాటిస్తున్నారని విమర్శించారు. జవాబుదారీతనం నుంచి తప్పించుకోవడానికే కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
విద్యా రంగంలో చోటుచేసుకుంటున్న సమస్యలను ప్రశ్నించాల్సిన మీడియా కూడా చాలా కాలంగా మౌనంగా ఉందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. దేశ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన **‘ఛాత్రోన్ కీ గూంజ్’** కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనాలని రాహుల్ పిలుపునిచ్చారు. జులై 17న డెహ్రాడూన్‌లో నిర్వహించనున్న కార్యక్రమానికి హాజరై విద్యార్థుల గొంతుకను మరింత బలంగా వినిపిద్దామని కోరుతూ, రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన లింక్‌ను కూడా తన ఎక్స్ పోస్టులో పంచుకున్నారు.
