- మహబూబ్‌నగర్ జిల్లా గోపా నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
- సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన గోపా రాష్ట్ర అధ్యక్షులు డా. బండి సాయన్న గౌడ్
- మహాబూబ్ నగర్ జిల్లాలో 5 వేల సభ్యత్వాలే లక్ష్యమని ప్రకటించిన నూతన కమిటీ
- గౌడ్ మేధావుల ఐక్య వేదికగా “గోపా”
మహబూబ్‌నగర్, జూలై 19 (వెలుతురు): గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (గోపా) ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ జిల్లా సర్వసభ్య సమావేశం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో గోపా మహబూబ్‌నగర్ జిల్లా నూతన కార్యవర్గాన్ని సభ్యులందరి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్న అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన గోపా రాష్ట్ర అధ్యక్షడు డాక్టర్ బండి సాయన్న గౌడ్ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించాడు.
అనంతరం అతిథి గోపా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బండి సాయన్న గౌడ్ మాట్లాడుతూ గౌడ సమాజ అభ్యున్నతికి అధికారులు, ఉద్యోగులు, ప్రొఫెషనల్స్, యువత ఒకే వేదికపైకి వచ్చి సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని కోరారు. విద్య, ఉపాధి, ఆర్థికాభివృద్ధి, సామాజిక చైతన్యం, రాజకీయ భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో గోపా కీలక పాత్ర పోషిస్తోందన్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు గౌడ్ యువత, విద్యార్థులు, ఉద్యోగులను సంఘటితం చేసి సమాజాభివృద్ధికి కృషి చేయాలని, ప్రస్తుతం ఉన్న ప్రజాప్రతినిధులను గౌరవిస్తూ కొత్త నాయకత్వాన్ని కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ, ఆర్థిక, పారిశ్రామిక రంగాల్లో గౌడ్ సమాజం మరింత ముందుకు సాగేందుకు గోపా ఒక బలమైన వేదికగా నిలుస్తుందని తెలిపారు.
గోపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మహిళలు, యువతను పెద్ద ఎత్తున సభ్యులుగా చేర్చుకోవాలని, రాజకీయ నాయకులు లేదా కుల పెద్దలను వ్యక్తిగతంగా విమర్శించకుండా సమాజ ఐక్యతే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా అధికారులు, ప్రొఫెషనల్స్‌ను సంఘటితం చేస్తూ గౌడ్ జాతి ఐక్యత కోసం గోపా కృషి చేస్తోందన్నారు.
జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన నాయిని బాగన్న గౌడ్ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా గౌడ్ సమాజాన్ని ఒకే వేదికపైకి తీసుకువస్తున్న ఏకైక సంస్థ గోపా అని పేర్కొన్నారు. సమాజంలో వివిధ కుల, ఉద్యోగ, సేవా సంఘాలు ఉన్నప్పటికీ, అవసరమైన సందర్భాల్లో అందరూ ఐక్యంగా పనిచేస్తేనే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని పిలుపునిచ్చారు. గోపా సిద్ధాంతాలను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లి గౌడ్ సమాజ ఐక్యత, అభివృద్ధి కోసం నూతన కమిటీ సమిష్టిగా కృషి చేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గోపా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ యల్మకంటి మీరయ్య గౌడ్, గజ్జగౌని మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నూతన జిల్లా కమిటీ
అధ్యక్షుడు: నాయిని బాగన్న గౌడ్
ప్రధాన కార్యదర్శి: కౌండిన్య రాజశేఖర్ గౌడ్
కోశాధికారి: పబ్బ శశిధర్ గౌడ్
ఉపాధ్యక్షులు: సి. సత్యనారాయణ గౌడ్, డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, గుముడాల గోవర్దన్ గౌడ్
