హైదరాబాద్, వెలుతురు, ఆగష్టు 22:
బతుకమ్మ పండగ సందర్భంగా తెలంగాణ ఫిల్మ్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ’యంగ్ ఫిల్మ్ మేకర్ ఛాలెంజ్ 2026 – సీజన్ 2’ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు తెలిపారు. ఈ సందర్బంగా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను శనివారం ఎఫ్‌డీసీ ఎండీ జి. ముకుంద రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ క్రెయేటివ్ డైరెక్టర్ రాజ్ కొండా, ఎఫ్‌డీసీ ఈడీ కిషోర్ బాబులతో కలిసి ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పండుగలు, కళారూపాలపై షార్ట్ ఫిలిం, పాటల పోటీలు ఉంటాయన్నారు. ఈ సారి కొత్తగా జానపద పాటలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ఇన్‌ఫ్లుయెన్సర్ల వీడియోస్, వ్యాసాలు (ఆర్టికల్స్) కు చోటు కల్పించామని తెలిపారు.
గత ఏడాది నిర్వహించిన బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ కు విశేష స్పందన లభించిందని, 500కు పైగా లఘు చిత్రాలు, బతుకమ్మ పాటలు వచ్చాయన్నారు. ఈ సంవత్సరం కూడా యువ ప్రతిభావంతులు పోటీలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
క్రియేటివ్ డైరెక్టర్ రాజ్ కొండా మాట్లాడుతూ ఈ పోటీలు యువతకు భవిష్యత్తులో సినీ రంగంలో అవకాశాలను సృష్టిస్తాయని, సృజనాత్మక కంటెంట్‌కు వేదికగా నిలుస్తాయని తెలిపారు. తెలంగాణ సంప్రదాయాలు, సంస్కృతి, పండగలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు విస్తృత స్థాయిలో ప్రాచుర్యం పొందేందుకు ఈ పోటీలు దోహదం చేస్తాయని అన్నారు.
లఘు చిత్రాల నిడివి 3 నిమిషాలు, పాటల రన్‌టైమ్ 5 నిమిషాలకు మించకూడదు. ఆయా వీడియోలు 4కే రిజల్యూషన్ కలిగి ఉండాలి. ఆసక్తి కలిగిన వారు వాటిని 2026 సెప్టెంబర్ 15లోపు youngfilmmakerschallenge@gmail.com మెయిల్ కు గానీ, 8125834009 వాట్సాప్ నంబరుకు గానీ పంపాలి. అనంతరం నిపుణులతో కూడిన జ్యూరీ విజేతలను ప్రకటిస్తుంది.
ఈ పోటీలలో ప్రథమ బహుమతి రూ.3 లక్షలు, ద్వితీయ బహుమతి రూ.2 లక్షలు, తృతీయ బహుమతి రూ. లక్ష. మరో ఐదుగురికి కన్సోలేషన్ బహుమతిగా రూ.20 వేల చొప్పున అందించనున్నారు. ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు ప్రదానం చేస్తారు.
