షావుకారు జానకి కన్నుమూత

హైదరాబాద్, వెలుతురు, ఆగష్టు 22:

ప్రముఖ నటీమణి షావుకారు జానకి (95) చెన్నై కావేరీ హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచారు.
ఆమె కొన్ని రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ గురువారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే కుటుంబసభ్యులు ఆమెను చెన్నైలోని కావేరి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఆమె తుదిశ్వాస విడిచారు.

షావుకారు జానకి ఏడు దశాబ్దాలకు పైగా సాగిన తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించి సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ఆమె హీరోయిన్‌గానే కాకుండా సహాయ నటి పాత్రల్లోనూ, క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ నటించి మెప్పించారు. ఆమెను భారత ప్రభుత్వం 2022లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

ఆమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్, శివాజీ గణేశన్, రాజ్ కుమార్, ప్రేమ్ నజీర్ లాంటి దిగ్గజ హీరోలందరి సరసన నటించి మెప్పించారు. ఎన్టీఆర్, ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత లాంటి నలుగురు ముఖ్యమంత్రులతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఏకైక సీనియర్ నటిగా అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.