హైదరాబాద్, వెలుతురు, సెప్టెంబర్ 03:
తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రిగా కొనసాగుతున్న కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించే ప్రక్రియకు తెరలేచింది. ఆమెను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సిఫారసు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు లేఖ పంపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఫారసును పరిశీలించిన అనంతరం సురేఖను తొలగిస్తూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఒక ప్రకటన ద్వారా మీడియాకు వెల్లడించారు.
ఎమ్మెల్యేగా కొనసాగుతా.. కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదు: కొండా సురేఖ
తెలంగాణ మంత్రివర్గం నుంచి తనను తొలగించినప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని మాజీ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. పార్టీకి రాజీనామా చేసే ఆలోచన లేదని, ఎమ్మెల్యేగా కొనసాగుతూ పార్టీకి, నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు.
మంత్రి పదవి నుంచి తొలగించినందుకు తనకు ఎలాంటి బాధ లేదని, అయితే కనీసం సరైన కారణం కూడా చెప్పకుండా తనపై చర్యలు తీసుకోవడంపై అసంతృప్తి ఉందని ఆమె పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా అధిష్ఠానం తీసుకునే నిర్ణయాలకు ఎప్పుడూ కట్టుబడి ఉంటానని చెప్పారు. అయితే తనపై చర్యలు తీసుకోవడానికి దారితీసిన కారణాలను స్పష్టంగా వెల్లడించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి తన వివరణ ఇచ్చానని చెప్పారు. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలిసేందుకు అపాయింట్‌మెంట్ లభించలేదన్నారు.
తనపై చర్యలు తీసుకుంటే బీసీ వర్గాలు ఏకమయ్యే అవకాశం ఉందని ఆమె వ్యాఖ్యానించారు. ‘‘నా బిడ్డ మాట్లాడితే నాకు ఎందుకు శిక్ష వేస్తారు? మహిళలు స్వతంత్రంగా జీవించాలని రాహుల్ గాంధీ చెబుతున్నారు. నా కూతురు మాట్లాడిన అంశానికి నాపై చర్యలు తీసుకోవద్దు’’ అని కోరారు. తనపై చర్యలు తీసుకునే ముందు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కొండా సురేఖ డిమాండ్ చేశారు. ‘‘పదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని రేవంత్‌రెడ్డి ఎలా చెబుతారు?’’ అని ప్రశ్నించారు.
ప్రభుత్వంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆమె ఆరోపించారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, భట్టి విక్రమార్క సతీమణికి సంబంధించిన కమిషన్లపై కూడా ఫిర్యాదులు వచ్చాయని, వాటిపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఇతర సామాజిక వర్గాలకు చెందిన నాయకులపై ఆరోపణలు వచ్చినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. మంత్రివర్గంలోని ఇతర సామాజిక వర్గాల నేతలపై కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయని, వాటిపై ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని ఆమె ప్రశ్నించారు. ఆరోపణలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వెల్లడించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలు, తనకు ఎదురైన అంశాలపై ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పార్టీ అధిష్ఠానానికి రాతపూర్వకంగా వివరించానని కొండా సురేఖ తెలిపారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఖర్గేను కలిసి కోరినట్లు చెప్పారు. తనను రాజీనామా చేయాలని పార్టీ అధిష్ఠానం నుంచి ఎవరూ కోరలేదని ఆమె స్పష్టం చేశారు. పార్టీ నిర్ణయం కోసం వేచి చూస్తానని, ఎమ్మెల్యేగా కొనసాగుతూ ప్రజలకు సేవ చేస్తానని కొండా సురేఖ పేర్కొన్నారు.
