మంత్రి పొన్నం ప్రభాకర్ కఠిన ఆదేశాలు
ఆర్‌సీవోలతో వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష
ఆగస్టు 30 గడువుగా తనిఖీల దిశగా అడుగులు
బీసీ గురుకులాల నిర్వహణపై పొన్నం సమీక్ష
వారంలో 3 రోజులు క్షేత్రస్థాయి పర్యటనలు
ప్రతి ఆర్‌సీవో కనీసం 6 పాఠశాలలను సందర్శించాలి
సొంత భవనాలు లేని పాఠశాలలకు భూసేకరణ
కలెక్టర్లతో సమావేశాలు, నియోజకవర్గాల్లోనే భవనాల ఏర్పాటు
హైదరాబాద్ వెలుతురు జూలై 21:
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మహాత్మా జ్యోతిబా ఫూలే బిసి సంక్షేమ గురుకుల విద్యాసంస్థలను ఈ ఏడాది ఆగస్టు 30వ తేదీ నాటికి పూర్తిస్థాయిలో తనిఖీ చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను స్పష్టంగా ఆదేశించారు. విద్యార్థులకు అత్యుత్తమ నాణ్యమైన విద్యతో పాటు పూర్తి సురక్షితమైన వాతావరణం, మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వం ప్రథమ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. బిసి గురుకులాల నిర్వహణ, విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, విద్యార్థుల సంక్షేమంపై రీజినల్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్లు (ఆర్‌సీవోలు), ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
గురుకుల విద్యాసంస్థల రోజువారీ పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ, విద్యార్థులకు ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూడాలని మంత్రి అధికారులకు సూచించారు. అందులో భాగంగా ప్రతి రీజినల్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ (ఆర్‌సీవో) వారానికి కనీసం మూడు రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, ప్రతి వారమూ కనీసం ఆరు గురుకుల విద్యాసంస్థలను స్వయంగా సందర్శించి పరిశీలించాలని ఆదేశించారు. ఆర్‌సీవోలు కేవలం కార్యాలయ పర్యవేక్షణకే పరిమితం కాకూడదని, ప్రధాన కార్యాలయానికి, జిల్లా యంత్రాంగానికి, పాఠశాలల నిర్వహణకు మధ్య ఒక బలమైన సంధానకర్తలుగా వ్యవహరిస్తూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు.
సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకుల విద్యాసంస్థలకు వెంటనే భూముల సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. దీనికోసం ఆయా జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేకంగా సమావేశమై అవసరమైన స్థలాలను సేకరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏ నియోజకవర్గానికి మంజూరైన గురుకుల పాఠశాల అదే నియోజకవర్గ పరిధిలోనే కొనసాగేలా, అక్కడ సొంత భవనాలు నిర్మించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇక అద్దె భవనాల్లో నడుస్తున్న విద్యాసంస్థలకు ప్రభుత్వం చెల్లించే మొత్తం అద్దెలో కనీసం 6 శాతం నిధులను ఆయా భవనాల మరమ్మతులు, పారిశుధ్య పనుల కోసం తప్పనిసరిగా కేటాయించాలని ఆదేశించారు.
ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని ఏ గురుకులంలోనూ ఆహారం వికటించి (ఫుడ్ పాయిజనింగ్) విద్యార్థులు అస్వస్థతకు గురయ్యే ఘటనలు పునరావృతం కాకూడదని మంత్రి హెచ్చరించారు. వంటశాలల పరిశుభ్రత, మెస్ నిబంధనలు, నిత్యావసరాల నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. విద్యార్థులు శారీరకంగానే కాకుండా మానసిక ఆరోగ్యంతో ఉండటానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఒత్తిడికి లోనుకాకుండా ఉండేందుకు నిపుణులైన సైకాలజిస్టులతో పాఠశాలల్లో ప్రత్యేక అవగాహన సమావేశాలు, కౌన్సిలింగ్ ప్రోగ్రామ్‌లు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
రాబోయే కాలంలో నీటి కొరత ఏర్పడకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తగా ప్రతి గురుకుల విద్యాసంస్థ ప్రాంగణంలో రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ (వర్షపు నీటి ఇంకుడు గుంతల) వ్యవస్థలను సమర్థవంతంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పాఠశాలల్లో పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ, వారి చేత పెద్ద ఎత్తున మొక్కలు నాటించాలని, ఆ నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతను కూడా విద్యార్థులకే అప్పగించి వారిలో బాధ్యతాయుత ప్రవర్తనను పెంపొందించాలని సూచించారు. భవనాల మరమ్మతుల నిధులను సకాలంలో ఉపయోగిస్తూ విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు.
గురుకులాల నిర్వహణపై క్షేత్రస్థాయిలో కచ్చితమైన సమాచారం తెలుసుకునేందుకు ప్రతి నెల కనీసం 15 గురుకుల విద్యాసంస్థలను తాను స్వయంగా, అలాగే శాఖ కమిషనర్, కార్యదర్శి కలసి అకస్మిక తనిఖీలు (సర్ ప్రైజ్ విజిట్స్) చేస్తామని మంత్రి ప్రకటించారు. విద్యార్థుల వసతి, భోజనం, విద్యా ప్రమాణాల విషయంలో అధికారులు లేదా ఉపాధ్యాయులు అలసత్వం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం సహించేది లేదని ఘాటుగా హెచ్చరించారు. తల్లిదండ్రుల నుంచి వచ్చే ఫిర్యాదులు, సూచనలపై తక్షణమే స్పందించి పరిష్కరించేలా ఒక ప్రత్యేక వ్యవస్థ ఉండాలన్నారు.
విద్యార్థులకు కేవలం పాఠ్యాంశాల బోధనకే పరిమితం కాకుండా క్రీడలు, లలిత కళలు, నాటకం, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాల్లోనూ ప్రత్యేక ప్రోత్సాహం అందించాలని మంత్రి కోరారు. క్రీడలు, ఇతర రంగాల్లో విశేష ప్రతిభ చూపించే విద్యార్థుల వివరాలను ప్రధాన కార్యాలయానికి పంపితే, వారికి ప్రభుత్వం తరఫున మరింత ఆర్థిక, నైతిక ప్రోత్సాహాన్ని అందిస్తామన్నారు. ఇదే సమయంలో మూసీ గురుకుల విద్యాసంస్థకు త్వరలోనే సొంత భవన నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి వెల్లడించారు.
అధికారులు క్షేత్రస్థాయి సమస్యలను నేరుగా తెలుసుకుని, అట్టడుగు స్థాయి విద్యార్థులకు సంక్షేమ ఫలితాలు అందేలా నిరంతరం కృషి చేయాలని మంత్రి ఈ సందర్భంగా ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయాదేవి, కార్యదర్శి బడుగు సైదులు, విభాగాధిపతులు, డిప్యూటీ సెక్రటరీలు, వివిధ జిల్లాల రీజినల్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్లు (ఆర్‌సీవోలు) ప్రత్యక్షంగా పాల్గొన్నారు.
