ప్రజా సమస్యలపై కేంద్రం మౌనం వీడాలి: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

  •  సీజేపీ కార్యకర్తలపై పోలీసుల చర్యను ఖండించిన కాంగ్రెస్ ఎంపీ
  • గాయపడిన కార్యకర్తలను పరామర్శించిన రాహుల్, ప్రియాంక
  • అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్
  • ధర్మేంద్ర ప్రధాన్‌ను ఎందుకు కాపాడుతున్నారని ప్రధాని మోదీని ప్రశ్నించిన చామల

హైదరాబాద్ వెలుతురు జూలై 21:

పార్లమెంట్‌లో ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తుతున్న ప్రజా సమస్యలకు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పకుండా తప్పించుకుంటోందని కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఢిల్లీలోని ఆర్‌ఎంఎల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీజేపీ మద్దతుదారులు, కార్యకర్తలను కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో కలిసి పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

సీజేపీ మార్చ్ సందర్భంగా ఢిల్లీ పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పలువురు కార్యకర్తలు గాయపడినట్లు చామల తెలిపారు. గాయపడిన వారిని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నామని చెప్పారు. విద్యార్థులు, యువతపై బలప్రయోగం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యానించారు.

ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని ఎంపీ డిమాండ్ చేశారు. అలాగే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు. పరీక్షల నిర్వహణ, విద్యార్థుల సమస్యల విషయంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

ప్రజలు మూడోసారి ప్రధాని మోదీకి అధికారాన్ని అప్పగించినప్పటికీ, వారి సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని చామల విమర్శించారు. పార్లమెంట్‌లో ప్రతిపక్షం లేవనెత్తుతున్న అంశాలపై సమాధానం ఇవ్వకుండా కేంద్రం వ్యవహరిస్తోందని అన్నారు.

రైతులు హర్యానాలో ఆందోళనలు నిర్వహిస్తుంటే వారిని అడ్డుకోవడం ఎందుకని ప్రశ్నించిన చామల, ప్రజాస్వామ్యబద్ధంగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కును ప్రభుత్వం గౌరవించాలని కోరారు. ప్రజలకు సంబంధించిన సమస్యలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి వెల్లడించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.