కోదండరాంను అడ్డుకున్న నిరుద్యోగులు

  • 60 ఏళ్లకు మీరు ఎమ్మెల్సీ.. 30 ఏళ్ల మాకు ఉద్యోగం వద్దా?
  • హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఉద్రిక్తత
  • ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితిపై మాట్లాడేందుకు వచ్చిన కోదండరాం
  • ఒక్కసారిగా చుట్టుముట్టిన నిరుద్యోగ యువత
  • తమ సమస్యలపై నిలదీసిన నిరుద్యోగులు

హైదరాబాద్, వెలుతురు, ఆగష్టు 12:

తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కోదండరాంను నిరుద్యోగుల నిరసన సెగ తాకింది. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి పెంపు అంశంపై మాట్లాడేందుకు వచ్చిన ఆయనను నిరుద్యోగ యువత అడ్డుకుని నిలదీశారు. పెద్ద సంఖ్యలో యువత ఒక్కసారిగా చుట్టుముట్టడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

‘‘60 ఏళ్లకు ఎమ్మెల్సీ.. మాకు ఉద్యోగం వద్దా?’’

ఈ సందర్భంగా నిరుద్యోగులు కోదండరాంను తీవ్రంగా ప్రశ్నించారు. ‘‘మీరు 60 ఏళ్ల వయసులో కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్లి ఎమ్మెల్సీ పదవి సాధించుకోవచ్చు.. కానీ మేం 30 ఏళ్ల వయసులో అన్ని అర్హతలు ఉన్నా ప్రభుత్వ ఉద్యోగం చేయడానికి పనికిరామా?’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వయోపరిమితి విషయంలో తమ పరిస్థితిని ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరారు. ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న తమకు వయోపరిమితి దాటిపోవడం మరో సమస్యగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నికల హామీలను గుర్తుచేసిన యువత

అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిరుద్యోగుల సమస్యలపై ఇచ్చిన హామీలను యువత ఈ సందర్భంగా గుర్తుచేసింది. అప్పట్లో మీరు చెప్పిన మాటలను నమ్మి కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేశామని, ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమ సమస్యలపై ఎందుకు మాట్లాడటం లేదని కోదండరాంను ప్రశ్నించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు, వయోపరిమితి పెంపు వంటి అంశాల్లో తక్షణ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు.

‘‘మా బాధ ఎవరికీ కనిపించడం లేదు’’

ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం చదువుతూ, పరీక్షలకు సిద్ధమవుతూ మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని పలువురు నిరుద్యోగులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ సమస్యలను ప్రభుత్వం మాత్రమే కాకుండా మీడియా కూడా సరిగ్గా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నిరుద్యోగుల వయోపరిమితి పెంపు అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోదండరాంను కోరారు. తమకు న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.